iDreamPost
android-app
ios-app

‘నిర్భయ’ కు ఏడేళ్లు

‘నిర్భయ’ కు ఏడేళ్లు

దేశ రాజధాని ఢిల్లి ప్రాంతం..
2012 డిసెంబర్ 16..ఇదే రోజు..
రాత్రి 9:30 గంటల సమయం. 23 ఏళ్ల యువతి, తన స్నేహితుడి తో కలసి సినిమాకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లేందుకు దక్షిణ ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బస్ స్టాప్ వద్ద ఎదురుచూస్తున్నారు. అంతలోనే ఓ బస్సు వచ్చి ఆగింది. అందులో డ్రైవర్ తో సహా ఆరుగురు ఉన్నారు. అందులో అందులో ఒకడు మైనర్. యువతి, యువకుడు బస్ ఎక్కారు. కొద్దీ సేపటి తర్వాత తాము వెళ్లాల్సిన మార్గంలో బస్ వెళ్లడం లేదని ఆ యువకుడు ప్రశ్నించారు. బస్ లో ఉన్న వారిలో క్రూర మృగాలు బయలుదేరాయి. యువతి, యువకుడి పై దుర్భాషలాడడం మొదలుపెట్టాయి.

యువకుడిని ఇనుప రాడ్డుతో కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. ఆపై ఆ మృగాలు యువతిపై అఘాయిత్యం చేశారు. పాశవికంగా ప్రవర్తించాయి. ఒక పక్క బస్ నడుస్తుండగానే ఆ యువతి పై అఘాయిత్యం చేస్తూ.. ఇనుప రాడ్డుతో ఇష్ఠానుసారం ప్రవర్తించాయి. కోన ఊపిరితో ఉన్న ఆ యువతి, యువకులను కదులుతున్న బస్సులో నుంచే రోడ్డు పైకి తోసేశారు. కొద్దీ రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ యువతి ప్రాణాలు విడిచింది. మహిళా రక్షణ పై దేశాన్ని ఏకం చేసిన ఈ ఘటనకు నిర్భయ అని పేరు పెట్టారు. రోజుల తరబడి ఢిల్లీలో విద్యార్థులు ఉద్యమం చేయడం తో మహిళా రక్షణకు చట్టం చేశారు. దానికి నిర్భయ అని పేరు పెట్టారు.

నిందితులైన ముకేశ్ సింగ్, మహమ్మద్ అఫ్రోజ్, వినయ్ శర్మ, అక్షయ ఠాకూర్, పవన్ గుప్తాలను 24 గంటల్లో అరెస్ట్ చేశారు. మహమ్మద్ అఫ్రోజ్ మైనర్ కావడంతో జువనైల్ హోమ్ కు తరలించారు. మిగిలిన నలుగురు నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధించింది. దీనిపై నిందితులు ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించారు. కోర్టు వారి పిటిషన్ ను తోసిపుచ్చింది. ఉరి శిక్ష ను ఖరారు చేసింది. సుప్రీం కూడా వారి పిటిషన్ కొట్టివేసింది. ప్రస్తుతం మరొకరి పిటిషన్ సుప్రీంలో పెండింగ్ లో ఉంది. కాగా, నిందితుల్లో ఒకరు జైలు లోనే ఉరి వేసుకున్నాడు.

నిర్భయ తర్వాత మహిళా రక్షణకు చట్టం తెచ్చిన మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు ఆగలేదు. మృగాళ్లు నిర్భయంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నిర్భయ తర్వాత మహిళలపై అత్యాచారాలు, పిల్లలపై లైంగిక వేధింపులు అధికమయ్యాయి. చట్టాలు చేసినా వాటి అమలులో జాప్యం జరుగుతుండడం ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. నిర్భయ చట్టం ప్రకారం పోలీస్ దర్యాప్తు, కోర్టు విచారణ పూర్తి చేసి 6 నెలలో దోషులకు శిక్ష వేయాలి. కానీ ఏ ఘటన నేపథ్యంలో చట్టం చేశారో ఆ నిర్భయ ఘటన లోనే నిందితులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదు. ఏడేళ్లుగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. తమ బిడ్డ నిర్భయ ఆత్మ శాంతి కోసం తల్లి దండ్రులు నిందితులకు శిక్ష పడేందుకు కోర్టుల్లో పోరాటం చేస్తూనే ఉన్నారు.