Idream media
Idream media
ఎనిమిది ఫైట్స్, నాలుగు ఐటమ్ సాంగ్స్ , గుర్రం దిగకుండా హీరో పాడే పాటలు రెండు, తుపాకులతో కాల్చుకునే సీన్స్ నాలుగు ఇవన్నీ కలిపి కుట్టేస్తే ఒక సినిమా అయిపోతుందా? 1972లో నిజం నిరూపిస్తా సినిమా ఇలాగే తీశారు. అప్పట్లో హాలీవుడ్‌లో వస్తున్న క్లింట్ ఈస్ట్ వుడ్ కౌబాయ్ సినిమాల ప్రేరణతో 1969 నుంచి 72 వరకు కృష్ణ అనేక సినిమాలు వచ్చాయి. అసలు కౌబాయ్ కల్చరే మనకు లేదు. గుర్రం మీద తిరుగుతూ పశువులు కాయడం మనకు తెలియదు. గుర్రం దొరికితే జట్కా నడుపుకుంటాం కానీ, ఆవులు ఎద్దులు కాస్తామా? ఒకవేళ కాయాలన్నా అంత అడవి మనకెక్కడుంది?
ఈ సినిమాలో కథ అంటూ ఉండదు. ఫైట్స్ , పాటల మధ్య ఎక్కడో ఇరుక్కుని ఉంటుంది. స్టార్ట్ కావడమే కృష్ణ, ఆయన డూప్ ఇద్దరూ కలిసి భీమ్‌రాజ్‌తో ఫైట్ చేస్తారు. తర్వాత అది ఫేక్ అని , భీమ్‌రాజ్ కృష్ణకి గురువని తెలుస్తుంది.
కృష్ణ తల్లి వచ్చి ఏదైనా వ్యవసాయం చేసుకోమంటే, పశువుల్ని కొనడానికి ఒంగోలు పరగాణా వెళుతున్నానని బయల్దేరుతాడు. పదరా బాటసారి అని గుర్రం మీద పాడతాడు. కృష్ణకు గుర్రపు స్వారీ బాగా వచ్చు. చాలా సీన్స్‌లో ఆయనే స్వారీ చేస్తాడు. దారిలో హీరోయిన్ విజయలలిత పరిచయం. ఇద్దరి మధ్య గొడవ. ఆ రోజుల్లో హీరోహీరోయిన్లు మొదట గొడవలతో, అపార్థాలతో Start చేసి తర్వాత ఆరు రీళ్ల తర్వాత ప్రేమించుకునేవాళ్లు.
త్యాగరాజు దగ్గర కృష్ణ పశువులు కొంటాడు. అవి దొంగ పశువులని ఒకాయన అడ్డగిస్తే కృష్ణ ఆత్మరక్షణ కోసం కాలుస్తాడు. తాను దొంగ కాదని, నిజం నిరూపిస్తానని టైటిల్ జస్టిఫికేషన్ ఇస్తాడు.
ప్రభాకర్‌రెడ్డి పెద్ద కోటీశ్వరుడి కొడుకైనా , తిన్నది అరక్క దోపిడీలు చేస్తూ ఉంటాడు. ఆ సొమ్ముని పాములు నివాసం ఉండే ఒక గోతిలో భద్రపరుస్తుంటాడు. పాములు కాపలా ఉంటే దొంగలు రారని అతని ఉద్దేశం. ఒక బండరాయితో పాముల్ని చంపి ఎవడైనా తీసుకోవచ్చనే లాజిక్ ఉండదు. విలన్ కదా!
రాజబాబుది ఇంకో ఎపిసోడ్. ఆ రోజుల్లో రాజబాబు లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్‌లు ఇచ్చేవాళ్లు కాదు. అందుకే రాజబాబుకి డ్రీమ్ సాంగ్ కూడా పెట్టారు.
విలన్ ప్రభాకర్‌రెడ్డి ఊరుకోడు కదా. హీరోయిన్ తండ్రిని చంపి చెల్లిని రేప్ చేస్తాడు. దాంతో ఆమె పగపడుతుంది. మధ్యలో రావుగోపాల్‌రావు కొత్వాల్. సత్యం, ధర్మం, విధి నిర్వహణ అంటూ ఉంటాడు. చేసేదేం ఉండదు. అప్పటికి ఆయనకి పేరు రాలేదు. అందుకే చిన్న వేషం.
హుజూర్ , కొత్వాల్ , హకీం, ఇలాంటి ఉర్దూ పదాలు వినపడుతూ ఉంటే సినిమా వినసొంపుగా ఉంది.
ఆఖరున విలన్‌ని చంపుతాడు. మధ్యలో జ్యోతిలక్ష్మి, హెలెన్ (హిందీ నృత్య తార) డ్యాన్స్‌లుంటాయి. ఈ సినిమా ఆడిందో లేదో తెలియదు. అప్పట్లో కృష్ణ సినిమాలు సంవత్సరానికి పది వచ్చేవి. దాంట్లో ఇదొకటి. చాలా సినిమాల్లో కృష్ణ నేలమీద కంటే గుర్రం మీదే ఎక్కువ ఉండేవాడు. క్రైం సినిమాల స్పెషలిస్ట్ సత్యం సంగీతాన్ని ఉతికి పడేశాడు. ఒక పాట కూడా గుర్తుండదు. సినిమాని మద్రాస్ , బెంగళూరు స్టూడియోల్లో , పరిసర ప్రాంతాల్లో తీశారు. దీని ప్రత్యేకత ఏమంటే ఫొటోగ్రఫీ, నిర్మాత , దర్శకుడు జానకిరాం. ఆ తర్వాత ఆయన ఏమీ తీసినట్టు లేరు.