Idream media
Idream media
ఈ నెల 11వ తేదీన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో పలువురు ఈ రోజు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మంచిరోజు కోసం వేచిచూసిన వారు.. వారం రోజుల తర్వాత బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. హోంమంత్రి తానేటి వనిత,వైద్య–ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణలు తమ తమ చాంబర్లలో పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులు తమ లక్ష్యాలను నిర్ధేశించుకున్నారు.
హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు. న్యాయం, చట్టం వివక్ష లేకుండా అందిస్తున్న ప్రభుత్వంలో.. ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో మూడేళ్లుగా సీఎం జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఏపీకి జాతీయ అవార్డులు కూడా తీసుకొచ్చారని గుర్తుచేశారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విడదల రజిని మాట్లాడారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషిచేస్తానని రజని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వైద్య రంగాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. బీసీలకు సీఎం జగన్.. ఎవ్వరు ఇవ్వనంత ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు.
సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. దళితుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయనని.. అంబేద్కర్ ఆలోచన, జగ్జీవన్‌రావు కాన్సెఫ్ట్‌తో ఆయన పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులు ఎవ్వరికీ అన్యాయం జరగకూడదనేదే సీఎం ఆలోచన అని నాగార్జున అన్నారు.
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణస్వామి ఎక్సైజ్‌శాఖలో ఇటీవల మరణించిన ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. తమది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలతో తామంతా ముందుకెళ్తామన్నారు.
దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొట్టు సత్యనారాయణ అనంతరం తన లక్ష్యాలను వివరించారు. ప్రస్తుతం దేవాలయాల్లో కొనసాగిస్తున్న సేవల కన్నా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రసాద్ స్కీమ్‌లో అన్ని ప్రముఖ దేవాలయాలని అభివృద్ధి చేస్తామని చెప్పారు.. చారిత్రాత్మకమైన ఆలయాలు ఏపీలో చాలా
ఉన్నాయన్నారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం సరిగాలేదని, దీనిపై దృష్టి సారిస్తామన్నారు. ప్రత్యేకయాప్ తయారు చేసి టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆలయాల్లో భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. సిబ్బంది కొరత అధిగమించడానికి అదనపు సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.