iDreamPost
android-app
ios-app

జనసేనకు అన్నీ గండాలే, అధిగమించడం పవన్ తరం అవుతుందా

  • Published Jan 05, 2022 | 2:34 AM Updated Updated Mar 11, 2022 | 10:27 PM
జనసేనకు అన్నీ గండాలే, అధిగమించడం పవన్ తరం అవుతుందా

ప్రజల కోసం సినిమాలను వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పినా ఓటర్లు విశ్వసించలేదు. చివరకు పోటీలో దిగిన రెండు చోట్లా జనసేన అధినేత జనాదరణ పొందలేకపోయారు. దాంతో చివరకు జనాలకు చెప్పిన దానితో సంబంధం లేకుండా మళ్లీ సినిమాల వైపు మళ్లారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తీరిక దొరికిన సమయంలో నెలకు ఒకటి, రెండు రోజులు రాష్ట్రానికి వస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధ్యలో మరో ఒకటి రెండు ట్వీట్లు చేసి సరిపెట్టుకుంటున్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారం ఇదే రీతిలో ఉంది. దానికి తగ్గట్టుగానే జనసేన పార్టీ కూడా ఉంది.

ఏపీలో ఆరు శాతం ఓట్లు సాదించిన జనసేన చివరకు ఒక్క శాతం ఓట్లున్న బీజేపీ కౌగిలిలో వాలిపోయిన నాటి నుంచి మరింత కుచించుకుపోయింది. పవన్ కళ్యాణ్ కేవలం తమకు క్రౌడ్ పుల్లర్ మాత్రమేనని బీజేపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే పవన్ కార్యాచరణ ఉంది.. ఇది చివరకు జనసేన శ్రేణులకు కూడా గిట్టడం లేదు. తన క్యాడర్ ని కూడా పవన్ సంతృప్తిపరచలేక పోతున్నారు. ఫ్యాన్స్ లో అసంతృప్తి రాజుకుంటోంది. దీనిని గ్రహించిన ఫలితంగానే విశాఖ ఉక్కు వంటి అంశాలపై ఒకటి రెండు అడుగులు వేశారు. అంతకుమించి ముందుకెళ్లేందుకు ఆయనకు కూడా పరిమితులున్నట్టు కనిపిస్తోంది. ఫలితంగా ఇప్పుడు జనసేనలో పవన్ గెస్ట్ గా మారగా, వ్యవహారం నాదెండ్ల మనోహర్ చుట్టూ తిరుగుతోంది.

పవన్ సొంత కులంలో ఈ పరిణామాలు కలకలం రేపుతున్నాయి. జనసేనని నాదెండ్ల మనోహర్ కి అప్పగించి, పవన్ పూర్తిగా సినిమాలకే ప్రాధాన్యతనిస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది. ఫలితంగా గడిచిన ఎన్నికల్లో 6 శాతం ఓట్లు అందులోనూ కాపు, బలిజ కులాల నుంచి తెచ్చుకున్న పవన్ బలం ఈసారి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని భావించే స్థితి వచ్చింది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకోవాలని కాపు కులంలో కీలక నేతలు కొందరు ప్రయత్నాలు మొదలెట్టారు. జనసేన ద్వారా కాపులకు ఒనగూరే ప్రయోజనం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీని ఏపీ వాసులు విశ్వసించరనే ధీమాతో ఉన్నారు. దాంతో మరో మార్గం అనుసరించేందుకు అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు పంపుతున్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ, టీడీపీలకు పోటీగా మరోశక్తి తెరమీదకు వస్తుందా అనే ఊహాగానాలకు ఆస్కారమిస్తున్నారు.

Alos Read : బ్లూ ప్రింట్‌ తయారు చేద్దాం.. అధికారం సాధిద్దాం.. ముద్రగడ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం

ముద్రగడ పద్మనాభం వంటి కాపులలో గట్టిపట్టున్న నాయకుడు కూడా రాజ్యాధికారం అంటూ ఆలోచన చేస్తున్నారు. త్వరలో కొత్త పార్టీకి ఆయన ప్రయత్నాలు మొదలెట్టారు. ఇలా కీలక కాపు నేతలు సమాలోచనలు చేస్తున్న దశలోనే ముద్రగడ నేరుగా ఎస్సీ, బీసీ , కాపు కాంబినేషన్ అంటూ మరో ముమ్మరయత్నానికి పూనుకోవడం జనసేనకు అతి పెద్ద గండంగా మారుతోంది. ఆపార్టీ పునాదులకే ప్రమాదం ఏర్పడుతోంది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ మనుగడ కి ముప్పు వస్తోంది. ఇప్పటి వరకూ పవన్ కి రాజకీయ ప్రాధాన్యత కేవలం ఆయన సినీ ఛరిష్మాతో పాటుగా కాపులలో ఉన్న బలం కారణంగానే దక్కుతోంది. ఇప్పుడు కాపులు మూడుముక్కలాట లేదా మరో క్యాంపుగా చీలితే పవన్ పరిమితమయిపోతారు. ఆయనకు దక్కే గౌరవం కూడా సన్నబడుతుందని చెప్పక తప్పదు.

కోస్తాలో కాపులను ముద్రగడ తనవైపు మళ్లించుకుంటే రాయలసీమలో బలిజలకు ప్రతినిధిగా ఎదగాలనే ఆలోచనలో మాజీ ఐపీఎస్ వీవీ లక్ష్మీనారాయణ ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేన తరుపున విశాఖ నుంచి బరిలో దిగి పరాజయం పాలయిన తర్వాత రాజకీయ ప్రయత్నాల్లో వివిధ ఎత్తులు వేస్తున్న ఆయన ప్రస్తుతం బలిజలకు తానే పెద్ద దిక్కుగా మారాలనే సంకల్పంతో ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఇటీవల ఆయన పలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇది కూడా పవన్ ప్రభావానికి ఎదురుదెబ్బ అవుతుంది. ముద్రగడ, వీవీ లక్ష్మీనారాయణ సహా వివిధ ప్రాంతాలలో ఆయా నేతల పట్టు పెరగడం పవన్ కి చేటు చేస్తుందనడంలో సందేహం లేదు. అంతిమంగా అది జనసేన రాజకీయాలకు ఆటంకం అవుతుందని భావించాల్సి ఉంటుంది.

రాజకీయంగా నిలదొక్కుకునే అవకాశాలున్న దశలో సినిమాల చుట్టూ తిరుగుతున్న పవన్ ఏపీ ప్రయోజనాల విషయంలో ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదగలేకపోయారు. ఫలితమే ఇప్పుడు కాపులలోనూ కదలికలు వస్తున్నాయి. ఎవరి దారి వారు చూసుకునే సమయం ఆసన్నమయ్యిందనే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో జనసేన భవితవ్యం మరింత అగమ్యగోచరంగా మారబోతోంది. ఇప్పటికే కాపు యువత తప్ప పెద్ద వయసు వారిలో జనసేన మీద విశ్వాసం కనిపించడం లేదు. దానిని పెంచుకునే ప్రయత్నాలు కూడా పవన్ చేయలేదు. అంతిమంగా ఇప్పుడు యూత్ లో కూడా పవన్ పట్ల ఆరాధన కు తాజా పరిణామాలు అడ్డంకి కాబోతున్నాయి. ఇవన్నీ కలిసి జనసేనకు గడ్డుస్థితిని కొనితెచ్చేలా ఉన్నాయి. ముందుగా జాగ్రత్తలు పడాలనే ధ్యాస కూడా జనసేనలో ఉన్నట్టు కనిపించడం లేదు. మరి ఎలా అధిగమిస్తారో చూడాలి.

Also Read : ముద్రగడ పార్టీ పెడితే.. శెట్టి బలిజలు కలిసి వస్తారా..?