Connect కనెక్ట్ రిపోర్ట్

కొత్త సినిమాలు చెప్పుకోదగ్గ కౌంట్ లో వస్తున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన జోష్ కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉండగా టికెట్ కౌంటర్ల దగ్గర సైతం ఏమంత హడావిడి కనిపించడం లేదు. రేపు రవితేజ ధమాకా మీద ట్రేడ్ ఆశలన్నీ. ఇది కూడా టాక్ పికప్ అయ్యాకే స్పీడ్ చూపించేలా ఉంది తప్పించి ముందస్తుగా అయితే ఎలాంటి దూకుడు సూచనలు లేవు. పోటీ ఎందుకని ఈ రోజు రెండు డబ్బింగ్ చిత్రాలు బాక్సాఫీస్ మీదకు దండెత్తాయి. అందులో నయనతార కనెక్ట్ ఒకటి. యువి సంస్థ పంపిణి బాధ్యతలు తీసుకోవడంతో చెప్పుకోదగ్గ రిలీజ్ దక్కింది. హారర్ జానర్ లో రూపొందిన ఈ దెయ్యాల బొమ్మ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

డాక్టర్ గా పని చేసే జోసెఫ్(వినయ్ రాయ్)కరోనా టైంలో పేషెంట్లకు సేవ చేస్తూ ఆ వైరస్ బారిన పడి హాస్పిటల్ లోనే కన్ను మూస్తాడు. ప్రాణంగా భావించే భార్య సుజన్(నయనతార), కూతురు అన్నా(హనియా నఫీసా)లు తట్టుకోలేకపోతారు. తండ్రి చివరి కోరిక తీర్చలేదన్న బాధతో ఉన్న అన్నా తొందరపాటుతో చేసిన పని వల్ల ఆమె ఒంట్లోకి దెయ్యం వస్తుంది. లాక్ డౌన్ టైం కావడంతో ఒకటే ఇల్లు అయినా ఎవరి గదిలో వాళ్ళు విడివిడిగా ఉంటూ వీడియో కాల్స్ లో కనెక్ట్ అవుతారు. అన్నాకు పట్టిన పీడను వదిలించేందుకు శామ్యూల్ (సత్యరాజ్) రంగంలోకి దిగుతాడు. అసలు అన్నాకు ఏం జరిగింది, ఆ కుటుంబంలో చెలరేగిన అలజడి చివరికి ఎలా సమిసిందనేది స్టోరీ

నటన పరంగా ఎవరినీ వంక పెట్టడానికి లేదు. ప్యూర్ హారర్ కాబట్టి నయన్ ఫ్యాన్స్ తన నుంచి ఎక్కువగా ఆశించకపోవడం మంచిది. లాక్ డౌన్ బ్యాక్ డ్రాప్ తో సహా తీసుకున్న పాయింట్ లో ఎలాంటి కొత్తదనం లేకపోవడం ఈ కనెక్ట్ కున్న ప్రధాన లోపం. దర్శకుడు అశ్విన్ శరవణన్ కేవలం సౌండ్ అండ్ టెక్నిక్ తో భయపెట్టాలని చూశాడు కానీ అది కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమయ్యింది. మిగిలినదంతా రొటీన్ వ్యవహారమే. మసూదలో ఉన్న డెప్త్ ఇందులో సగం కూడా లేదు. అందుకే తొంబై తొమ్మిది నిమిషాలే ఉన్నప్పటికీ కనెక్ట్ ఆడియన్స్ కి పూర్తిగా కనెక్ట్ కాలేక యావరేజ్ కంటే కింది మెట్టు దగ్గరే ఆగిపోయింది. చాలా తక్కువగా హారర్ కంటెంట్ చూసేవాళ్లకు తప్ప మిగిలినవాళ్ళకు మిగిలే థ్రిల్స్ తక్కువే

Show comments