1980 వ దశకంలో దేశంలో వచ్చిన టెలికాం విప్లవంతో ఇటీవల దాకా ఒక వెలుగు వెలిగిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బియస్ఎన్ఎల్ ( భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ) ప్రస్తుతం ఉద్యోగుల వైఖరి, యాజమాన్యం అలసత్వంతో టెలికాం రంగంలో ప్రయివేట్ కంపెనీలతో పోటీ తట్టుకోలేక దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఈ సెల్ ఫోన్స్ రాకముందు ఎవరి ఇంటిలోనైనా ఈ బియస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉందంటే దానిని స్టేటస్ సింబల్ గా భావించేవారు. ఎవరైనా బియస్ఎన్ఎల్ ఫోన్ కనెక్షన్ కావాలనుంటే అప్పట్లో అదొక పెద్ద ప్రక్రియ. కాల్ ధరలు, పల్స్ రేట్లు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేవి కావు.
ఈ దశలో దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో అన్ని రంగాల లాగే టెలికాం రంగంలో కూడా పెద్ద ఎత్తున రావడం ప్రయివేట్ పెట్టుబడులుతో టాటా, బిర్లా, రిలియన్స్, ఎయిర్ టెల్ లాంటి దేశంలోనే పేరుమోసిన ప్రయివేట్ కార్పొరేట్ దిగ్గజ సంస్థల తో పాటు పలు అంతర్జాతీయ టెలికాం సంస్థలు కూడా దేశంలో అడుగు పెట్టడం, సెల్ ఫోన్ ప్రవేశంతో టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పు రావడం తో పాటు చాలా చవకగా నాణ్యమైన సేవలు వినియోగదారులకి అందించడం మొదలుపెట్టాయి.
ఇదే సమయంలో ప్రభుత్వ టెలికాం రంగ సంస్థలైన బియస్ఎన్ఎల్, యంటిఎనెల్ లు మొదట్లో ప్రయివేట్ సంస్థలకి కొంత పోటీ ఇచ్చినప్పటికీ, తరువాత కాలంలో విధానపరమయిన నిర్ణయాలు తీసుకోవడంలో విపరీతమైన అలసత్వం తో పాటు ప్రభుత్వం నుండి సరైన సమయానికి ప్రోత్సాహం లభించకపోవడంతో, ప్రయివేట్ రంగంలో పోటీ పడలేక చేతులెత్తేశాయి. చివరికి ఒకప్పుడు కేంద్రప్రభుత్వ రంగంలోనే మంచి పేరున్న బియస్ఎన్ఎల్ కాస్తా ఇప్పుడు ఆర్ధికంగా కేంద్రప్రభుత్వానికి పెద్ద గుదిబండగా మారింది. ఇప్పుదు ఈ సంస్థ పై రుణభారం షుమారు 40 వేల కోట్ల వరకు ఉంది.
ఈ నేపథ్యంలో సంస్థపై నష్టాల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం బియస్ఎన్ఎల్, యంటిఎనెల్ లో 50 ఏళ్ళు దాటిన సిబ్బంది అందరికి స్వచ్ఛదంగా పదవి విరమణ చేసే అవకాశం ఇవ్వడం ద్వారా గణనీయంగా జీతాలు రూపంలో చెల్లించాల్సిన డబ్బులు మిగులుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్వచ్చంద పదవి విరమణ పధకాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ను ఎంచుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 3 గా నిర్ణయించారు. దీనితో దేశవ్యాప్తంగా షూమారు 92,700 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ను ఎంచుకున్నారు. నిన్నటితో దేశవ్యాప్తంగా ఈ VRS తీసుకున్న సిబ్బంది మొత్తం ఒకేసారి పదవీ విరమణ చేశారు.
బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన 78,300 మంది ఉద్యోగులు, ఎమ్‌టిఎన్‌ఎల్‌లో 14,378 మంది ఉద్యోగులు ఈ పథకాన్ని ఎంచుకున్నారు. అదే సమయంలో విఆర్‌ఎస్ దరఖాస్తుదారులతో పాటు, 6,000 మంది ఉద్యోగులు కూడా పదవీ విరమణ చేశారు. స్వచ్చంద విరమణ తర్వాత సంస్థలో 85,000 మంది ఉద్యోగులు మిగిలారని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి.కె. పూర్వర్ మీడియా కి తెలియచేసారు. బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్‌ల స్వచ్ఛంద పదవీ విరమణ పథకం డిసెంబర్‌లో ముగిసింది. అలా స్వచ్చంధంగా పదవి విరమణ చేసిన ఉద్యోగులు తమ మిగిలిన సర్వీసు కాలానికి ఇప్పుడు తీసుకుంటున్న జీతం ప్రకారం నెలకు 25 రోజుల జీతం లభిస్తుంది. ఈవిధంగా కొంతమంది ఉద్యోగులకు పదేళ్లు సర్వీసు మిగిలి ఉండడం తో అలాంటి వారికి వి.ఆర్.యస్ కింద దాదాపు 90 లక్షల రూపాయలు వరకు పొందినట్టు తెలుస్తుంది.