iDreamPost
android-app
ios-app

ఈ పరీక్ష పాసైతే చాలు.. రూ. 48 వేలు పొందే ఛాన్స్..

ఈ పరీక్ష పాసైతే చాలు.. రూ. 48 వేలు పొందే ఛాన్స్..

నిరుపేద కుటుంబంలో పుట్టిన పిల్లలకు.. చదువుకోవాలన్న ఆశ ఉంటుంది. కానీ రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. దీంతో బడి మధ్యలోనే వదిలేసి పనిబాట పడుతున్న వారెందరో. తల్లిదండ్రుల సంపాదనతో బతకడమే కష్టంగా మారుతుండటంతో.. వారూ బాలకార్మికులుగా మారుతున్నారు. ప్రభుత్వ బడుల్లో ఉచిత విద్య అందిస్తున్నా.. ఇతర అవసరాలకు కాస్తంత డబ్బులు కూడా లేక ప్రతిభావంతులైన విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. ఆర్థిక స్తోమత సరిగా లేని.. చదువుకోవాలన్న జిజ్ఞాస కలిగిన విద్యార్థుల కోసం ఉపకార వేతనాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీని కేవలం మంచి మార్కులతో పాటు మీ ప్రతిభ ఉంటే సరిపోతుంది. ఇది ఎప్పటి నుండో ఉన్నా.. తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో పాటు ఉపాధ్యాయులు చొరవ చూపకపోవడం వల్ల ఇటువంటి మంచి ఫలాలను మిస్ అవుతున్నారు విద్యార్థులు.

నిరు పేద విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా కొనసాగించేందుకు ఆర్థిక చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష నిర్వహిస్తారు. అదే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీం (ఎన్ఎంఎంఎస్). ఈ ఉపకార వేతనాన్ని నాలుగేళ్లు అందిస్తారు. అంటే 9 నుండి 12వ తరగతి వరకు అందిస్తారు. ఏటా 12 వేల రూపాయలను అందిస్తారు. అంటే నాలుగేళ్లలో రూ. 48 వేలు పొందవచ్చునన్న మాట. తొలుగ రూ. 6 వేలు మాత్రమే ఈ ఉపకార వేతనం ఉండగా.. ఇప్పుడు అది 12 వేల రూపాయలకు పెరిగింది. ఈ ఏడాదికి సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 8వ తరగతి నుండి డ్రాపౌట్‌ను తగ్గించే లక్ష్యంతో ఈ స్కాలర్ షిప్‌ను తీసుకు వచ్చింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రస్తుతం విడుదలైంది.

తెలంగాణలో అక్టోబర్ 1 నుండి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. స్కాలర్ షిప్ పొందేందుకు ఎవరెవరు అర్హులు అంటే.. తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం 3.50 లక్షల రూపాయలు మించకూడదు. ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక, స్థానిక సంస్థల పాఠశాలలు, రెసిడెన్షియల్ వసతిలేని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. వీరు 2021-22 విద్యా సంవత్సరంలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థు లైతే 50 శాతం సాధించాలి. అలాగే తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలో చదివి 10 ఆపై తరగతులు ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో చదివితే.. ఉపకార వేతనాన్ని నిలిపివేస్తారు. దరఖాస్తులు చేసుకునేటప్పుడు ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలి.

దీనికి దరఖాస్తు చేసుకునేందుకు కుల, ఆదాయ ధ్రువ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, పాస్ పోర్టు సైజ్ ఫోటోతో సంబంధిత పత్రాలను సదరు వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి పొందుపరచాలి. ఓసీ, బీసీ విద్యార్థులైతే రూ.100, ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులైతే రూ.50 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో 180 మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుంది. అన్ని బహుళైచ్ఛిక ప్రశ్నలే ఉంటాయి. దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబరు 10న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో అర్హులైన విద్యార్థులకు రూ. 12 వేలు జూన్ లేదా జులై నెలలో జమ చేస్తారు. అవి కూడా నేరుగా విద్యార్థుల ఖాతాలో పడతాయి. సో ఇంకేందుకు ఆలస్యం అప్లై చేసుకోండిలా.