iDreamPost
android-app
ios-app

హీరో కావాల్సిన నాజర్ కొడుకు..9 ఏళ్లుగా జీవచ్ఛవంలా..

హీరో కావాల్సిన నాజర్ కొడుకు..9 ఏళ్లుగా జీవచ్ఛవంలా..

సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన ప్రముఖ నటుల్లో ఒకరు నాజర్. ఆయన గురించి, నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు, తమిళ సినిమాల్లో ఇప్పటికే బిజియెస్ట్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే.. నాజర్ అని చెప్పొచ్చు. అయినా చిన్న పాత్ర చేసినా దానికి 100 శాతం న్యాయం చేస్తారు. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్‌గా రాణించారు. నడిగర సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు నాజర్. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, హిందీ, ఇంగ్లీష్, బెంగాళీ, మలయాళంలో సుమారు 550లకు పైగా సినిమాల్లో మెప్పించిన ఆయన.. ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. కానీ ఆయన వెనుక అంతులేని విషాదం దాగి ఉందని ఎవ్వరికీ తెలియదు.

చేతికొచ్చిన కొడుకు, మరికొన్ని రోజుల్లో హీరోగా పరిచయం చేద్దామనుకున్నారు.. అంతలోనే ఊహించని ఉపద్రవం వారి ఇంట్లో చీకట్లు కమ్మేలా చేసింది.నాజర్, ఆయన భార్య కమీలాకు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు అబ్దుల్ ఫైజల్ హాస్సన్, లూత్ఫుద్దీన్, అభి హాస్సన్. వీరిలో పెద్దబ్బాయి అబ్దుల్ ను హీరో చేద్దామనుకున్నారు నాజర్. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో 2014లో అతడి కారుకు పెద్ద ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అతడు చావు అంచుల వరకు వెళ్లాడు. తల్లిదండ్రులను కూడా మర్చిపోయాడు. చివరకు అతడికి చికిత్స అందించగా.. మెల్లిగా కోలుకుంటున్నాడు కానీ.. పూర్తిగా మంచానికి, కుర్చీకి పరిమతమయ్యాడు.

అతడికి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ అంటే వల్లమాలిన అభిమానం. అతడి సినిమాలు, పాటలు విన్నా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తాడు అబ్దుల్. ఈ విషయం తెలిసిన విజయ్ .. పలుమార్లు అతడి పుట్టిన రోజు వేడుకలకు హాజరై.. అతడిని ఆనంద పరుస్తూ ఉంటాడు. మరికొన్ని రోజుల్లో హీరో కావాల్సిన కుమారుడు 9 ఏళ్లుగా మంచానికి పరిమితమయ్యాడు. చేతికొచ్చిన కొడుకు జీవచ్ఛవంలా మారిపోతే ఏ తల్లిదండ్రులకైనా బాధ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నప్పటికీ.. కుమారుడికి సమయం కేటాయిస్తుంటారు నాజర్. ఇక రెండో కుమారు లూత్ఫుద్దీన్ ఇప్పటికే పలు తమిళ సినిమాల్లో నటించాడు. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.