iDreamPost
iDreamPost
గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలో ఫిబ్రవరిలో జరిగిన ఓ ఘటనలో అనూష ప్రాణం కోల్పోయింది. నిందితుడిని 4 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు పూర్తిచేసి 8 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో ఉంది. త్వరలోనే కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. పోలీసులు సేకరించిన ఆధారాలను బట్టి కఠినమైన శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది.
దొంగలు పడ్డ ఆర్నెల్లకు ఏదో జరిగిందన్నట్టుగా ఇప్పుడు లోకేష్ యాత్ర అవసరం ఏమిటో అర్థం కాదు. పోనీ ఆయన పరామర్శ చేయాలనే అనుకుంటే దానికి జనసమీకరణ చేయాల్సిన అవసరమేమిటో తెలియదు. పోనీ ఆయన నిజంగా అనూష హత్య ఘటనని రాజకీయం చేయాలని అనుకుంటే అదేమీ తప్పు కాదు.. కానీ తన కార్యక్రమం పోలీసులకు తెలిపి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదేమీ లేకుండా తనకు తోచినట్టు చేస్తానని అనడమే తగాదా.
Also Read:ఎవరి కోసం నారా లోకేష్ పరామర్శ యాత్రలు ?
ఈసందర్భంగా గన్నవరం విమానాశ్రయం వద్ద లోకేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఆయన పోలీసుల మీద కస్సుమన్నారు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు అంటూ మాట్లాడారు. బాగానే ఉంది..ఆయన అపొజిషన్ లో ఉన్నారు కాబట్టి.. ఇప్పుడు అవసరం కాబట్టి అవన్నీ గుర్తుకొచ్చాయి. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారు. పరామర్శ చేయడం నేరమా అని ప్రశ్నించిన లోకేష్ తాను అధికారంలో ఉండగా అమరావతిలో ప్రస్తుత ఎంపీ నందిగం సురేష్ మీద ఏమేమి చేశారో తెలీదా.. అమరావతి ఏరియాలోనే సీపీఎం నాయకుడి మీద 100 కేసులు పెట్టిన సంగతి మరచిపోయారా.. తమ పార్టీ కార్యకర్త దగ్గరకి వెళుతుంటే తుందుర్రులో మాజీ ఎంపీ అని కూడా చూడకుండా సీపీఎం మధు పట్ల ఎలా దురుసుగా ప్రవర్తించారో గుర్తుచేయాలా. గన్నవరంలో ఎమ్మెల్యే రోజా పట్ల వ్యవహరించిన తీరు గమనంలో లేదా..
పోనీ అవన్నీ రాజకీయ కార్యక్రమాలు అనుకుందామంటే అమరావతి పర్యటనకు వచ్చిన పర్యావరణ వేత్తల పట్ల, మేధాపాట్కర్ వంటి వారి పట్ల ఏమి చేశారో తెలీదా.. అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం చేసి వంటలక్కల పట్ల వ్యవహరించిన తీరు మదిలో లేదా.. ఇలా ఒకటేమిటి అన్ని తరగతుల పట్ల అణచివేత ధోరణి చూపిన గతం గుర్తు చేసుకుంటే వాస్తవం బోధపడుతుంది. ఇటీవల కర్నూలు సహా అనేక జిల్లాల్లో పర్యటనలు చేసిన లోకేష్ యాత్రలు గుంటూరులో మాత్రం గందరగోళం సృష్టించాలనే యత్నం వెనుక అసలు లక్ష్యం జనాలకు అర్థం కాకుండా పోదు. కాబట్టి రాజ్యాంగ బద్ధంగా తాము ఉన్నప్పుడే ఎదుటివారిని రాజ్యాంగబద్ధంగా నిలదీయవచ్చని గ్రహించడం మంచిది.
Also Read:కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ.. గవర్నర్ ఆమోద ముద్ర వేసేనా?