నారా లోకేష్‌ కూడా సర్దుకున్నారా..?

2019 ఎన్నికల తర్వాత దాదాపు రెండేళ్ల వరకూ నారా లోకేష్‌ను టీడీపీ రథసారధిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ శ్రేణులు, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేశాయి. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్‌లో సాగిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నారా లోకేష్‌ పనితీరు ఆయన పరిజ్ఞానం, నాయకత్వ సమర్థతను తెలియజేశాయి. టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతాడనే ప్రచారం వల్ల.. నష్టం జరుగుతుందనే భావన టీడీపీకి, దాని అనుకూల మీడియాకు తెలిసొచ్చింది. అందుకే ఏడాది నుంచి రూట్‌ మార్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారంటూ అనుకూల మీడియా రూటు మార్చి రాసుకొచ్చింది. టీడీపీ గెలిస్తే.. లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతాడని ప్రచారం చేస్తూ వైసీపీ దెబ్బతీసేందుకు యత్నిస్తోందంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గత ఏడాది తన కొత్తపలుకులో రాసుకొచ్చారు.

మొత్తం మీద టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చిన లోకేష్‌.. ఆ తర్వాత తెరమరుగయ్యారు. ఏడాది కాలంగా లోకేష్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం నుంచి మెల్లగా టీడీపీ, ఆపార్టీ అనుకూల మీడియా తప్పించింది. తన భార్యను అవమానించారని, మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే సభలోకి అడుగుపెడతానంటూ చంద్రబాబు అసెంబ్లీలో శపథం చేసి బయటకు వచ్చారు. ఒకవేళ టీడీపీకి అధికారం చేపట్టే అవకాశం వస్తే.. అప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా.. ఎన్నికల లోపు అయితే నారా లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతారనే మాట అయితే వినిపించే అవకాశం లేదు.

ఈ విషయం నారా లోకేష్‌కు కూడా అర్థమైనట్లు ఉంది. మంత్రి , ముఖ్యమంత్రి పదవులు సంగతి ఎలా ఉన్నా.. ముందు ఎమ్మెల్యేగా గెలవాలని లోకేష్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉన్నారు. అందుకోసం ఇటీవల కాలంలో తరచూ మంగళగిరిలో పర్యటిస్తున్నారు. తాజాగా నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్‌.. అక్కడ ప్రజలకు చేసిన విజ్ఞప్తి టీడీపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. వచ్చే 2024 ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలంటూ నారా లోకేష్‌ మంగళగిరి ప్రజలకు విన్నవించడం విశేషం.

చంద్రబాబు ప్రభుత్వంలో నారా లోకేష్‌ మూడు శాఖలకు మంత్రి అయ్యారు.2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవకుండానే పెద్దల సభకు వెళ్లి..మంత్రి పదవి పొందారు.2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంగళగిరిని ఎంచుకున్నారు. రాజధాని ప్రాంతంగా మంగళగిరిని ఎంపికచేయడం తనకు లాభిస్తుందని నారా లోకేష్‌ భావించారు. అయితే లోకేష్‌ లెక్క తప్పింది. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓడిపోయారు. ఆ తర్వాత లోకేష్‌ నియోజకవర్గం మారతారని, ఈసారి గెలిచేందుకు అవకాశం ఉన్న సీటును వెతుక్కుంటున్నారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించిన నారా లోకేష్‌.. తాను మంగళగిరిని వదిలి ఎక్కడికీ వెళ్లబోనని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానంటూ ఇటీవల ప్రకటించారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సారైనా తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నారా లోకేష్‌ విజ్ఞప్తిని మంగళగిరి ప్రజలు పరిగణలోకి తీసుకుంటారా..? లేదా..? 2024 ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది.

Show comments