iDreamPost
iDreamPost
నిన్న టాలీవుడ్ మొదటి సోషియో ఫాంటసీ మూవీ ఆదిత్య 369 ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, హీరో బాలకృష్ణ తదితరులతో స్పెషల్ వీడియో చేయించి మరీ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు. ఇన్నేళ్లు గడుస్తున్నా ఈ చిత్రం తాలూకు వైబ్రేషన్స్ ఇప్పటి జెనరేషన్ కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నారంటే అప్పట్లోనే ఎంత గొప్ప ఆలోచనలతో దీన్ని తెరకెక్కించారో అర్థమవుతుంది. ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఎప్పటికీ నిత్య నూతనం అని చెప్పాలి. అందుకే దీని గురించి ఎంత చర్చించుకున్నా తక్కువే.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆదిత్య 369కి సీక్వెల్ ఉంటుందని దాంతోనే మోక్షజ్ఞ ఎంట్రీ చేయిస్తానని చెప్పడం అభిమానుల్లో మరోసారి ఉత్సుకతను రేపింది. ఇది గతంలో చెప్పిన విషయమే అయినప్పటికీ బాలయ్య మరోసారి ప్రస్తావన తేవడంతో ఈ ప్రాజెక్ట్ ఉంటుందనే క్లారిటీ స్పష్టంగా ఇచ్చినట్టే. అయితే ఈ మూడు దశాబ్దాల కాలంలో టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి. రాజమౌళి, శంకర్ లాంటి దర్శకుల పుణ్యమాని సౌత్ సినిమాలోనూ అత్యున్నత ప్రమాణాలు వచ్చి చేరాయి. బడ్జెట్లు వందల కోట్లు దాటేసి ఎంత ఖర్చు పెట్టినా వెనక్కు వస్తాయనే గ్యారెంటీని ఇచ్చేశాయి
ఇలాంటి వాతావరణంలో ఆదిత్య 999 తీయాలంటే అంత ఆషామాషీ కాదు. అందులోనూ బాలయ్యనే డైరెక్ట్ చేస్తానని అంటున్నారు. కానీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు, ఎవరైనా ఇతర నిర్మాతలు ఇందులో తోడవుతారా, ఎలాంటి కథతో తీస్తారు అనే విషయాలు చాలా బయటికి రావాలి. ఫ్యాన్స్ చూస్తేనేమో మోక్షజ్ఞ ఎంట్రీ కమర్షియల్ గా ఉండాలని కోరుకుంటున్నారు. చిరుత, రాజకుమారుడు, నిన్ను చూడాలని, ఈశ్వర్ ఇలా ఇప్పటి స్టార్ల డెబ్యూలన్నీ ఎక్స్ పరిమెంట్ చేసినవి కాదు. సేఫ్ గేమ్ ఆడినవి. అలాంటప్పుడు మోక్షజ్ఞను ఆదిత్య 999తో లాంచ్ చేయాలనుకోవడం మాత్రం కొంత రిస్కే. చూడాలి మరి దీనికే కట్టుబడతారో లేదో