iDreamPost
android-app
ios-app

అంతుబట్టని వ్యాధి ఆగింది

  • Published Dec 13, 2020 | 3:21 AM Updated Updated Dec 13, 2020 | 3:21 AM
అంతుబట్టని వ్యాధి ఆగింది

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నాలుగు రోజుల పాటు నానా హైరానా పెట్టిన అంతుబట్టని వ్యాధి ప్రస్తుతం ఆగింది. గత రెండు రోజులుగా ఈ గుర్తు తెలియని అస్వస్థత కారణంగా ఆసుపత్రులకు వచ్చిన వాళ్ళెవ్వరూ లేకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.పెరిగి పోతోంది, విస్తరించేస్తోంది అంటూ నానా ప్రచార హడావిడి కన్పించినప్పటికీ వ్యాధి భారిన పడేవారి సంఖ్య దాదాపుగా నిలిచిపోవడంతో ఇప్పుడు యంత్రాంగానికి ఊరటనిస్తోంది. వ్యాధి ప్రభలిన నాటి నుంచి మొదలు ఏలూరులోనే మకాం పెట్టిన రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నాని చికిత్స పొంది ఇళ్ళకు చేరుకున్న వారిని వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ 600 మంది ఈ వ్యాధి భారి నుంచి కోలుకుని ఇళ్ళకు చేరుకున్నారని వివరించారు. అయితే ఈ గుర్తు తెలియని అస్వస్థతకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. బియ్యంలో మెర్క్యురీ ఆనవాళ్ళు ఉండడంతో పాటు, బాధితుల శరీరంలో భారి లోహాలైన లెడ్, నికెల్‌ వంటి వాటిని నిపుణులు గుర్తించారు. దాదాపుగా రోగులకు కన్పించిన లక్షణాలుకు ఈ లోహాలే కారణం కావొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ ఈ లోహాలు బాధితుల శరీరాల్లోకి ఏ విధంగా చేరుకున్నాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

నేరుగా రక్తంలోకి చేరుకోవాలంటే ఆహారం, త్రాగునీరు ప్రధాన పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరులోని గుర్తు తెలియని అస్వస్థతకు గురైనా బాధితులను అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. దాదాపుగా 14 సంస్థలు ఏలూరు అస్వస్థత గుట్టును తేల్చేయాలని రంగంలోకి దూకాయి. వీరికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాకారాన్ని అందజేస్తోంది.

చేస్తున్న పరీక్షల లక్షణాలను బట్టి కొంత సమయంల పడుతుందని నిపుణులు చెబుతున్నారు. బుధవారం నాటికి పూర్తిస్థాయిలో అస్వస్థతకు గల కారణాలు వెల్లడయ్యేందుకు ఆస్కారం ఉందని రాష్ట్ర వైద్యశాఖామంత్రి ఆళ్ళ నాని స్వయంగా ప్రకటించారు. ఇప్పటికో రోగుల సంఖ్య తగ్గిపోవడంతో పాటు, అసలు గుట్టు కూడా త్వరలోనే తలిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. యావత్‌ యాంత్రాంగంతో పాటు, స్వయంగా ఏపీ సీయం వైఎస్‌ జగన్‌ కూడా రంగంలోకి దిగి ఏలూరు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన విషయం విదితమే.

ఇదిలా ఉండగా బాధితుల శరీరాల్లోని భార లోహాలకు రసాయనిక ఎరువులు, పురుగుమందులే కారణం అయితే గనుక, రైతులకు వీటిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సీయం జగన్‌ ఆదేశించారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. ఒక పక్క అనారోగ్యానికి కారణం ఏంటన్నది శోధిస్తూనే, మరో పక్క సమస్యకు మూలాన్ని ఛేధించేందుకు సీయం తీసుకుంటున్న చర్యలను పలువురు అభినందిస్తున్నారు.