మూసీ పరీవాహక ప్రాంతాల్లో హైఅలర్ట్‌

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్ర‌వాహం పెర‌గ‌డంతో గండిపేట, ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ గేట్లను ఎత్తివేశారు. ఆ వ‌ర‌ద‌ మూసీ నదిలోకి పోటెత్తింది. ఈరోజు మూసీ న‌దీ మ‌రింత ఉగ్ర‌రూపం దాల్చ‌వ‌చ్చ‌న‌న్న‌ది అధికారుల అంచ‌నా. అందుకే మూసీ పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. అల‌లు అలుగా వ‌ర‌ద వ‌స్తుండ‌టంతో హైదరాబాద్‌లోని జియాగూడవద్ద మూసీ పొంగిపొర్లుతున్నది. చాదర్‌ఘాట్‌ లోలెవల్‌ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించ‌డంతో బ్రిడ్జిని మూసివేశారు.


మూసారాంబాగ్‌ చాందిని బ్రిడ్జిపైని కూడా మూసీ మింగేయ‌డంతో, మూసారాంబాగ్‌ వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. చాదర్‌ఘాట్‌లోని మూసానగర్‌, శంకర్‌ కాలనీ బస్తీల్లో వ‌ర‌ద మూడు అడుగుల మేర క‌నిపిస్తోంది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

గండిపేట చెరువు 13 గేట్లను ఎత్తివేయడంతో, వ‌ర‌ద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. వరదలో చిక్కుకున్న గండిపేట ఫాంహౌస్‌లోని కుటుంబాన్ని, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చిన్నారి సహా ఐదుగురిని రక్షించారు.

Show comments