మున్సిపల్‌ వార్‌.. తాడిపత్రిలో ఏం జరుగుతోంది…?

ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో జరుగుతున్న ఎన్నికలు ఒక ఎత్తు అయితే, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికలు మరో ఎత్తు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే కుమారుడు, మాజీ ఎమ్మెల్యే కౌన్సిలర్లుగా పోటీ చేస్తుండడం ప్రత్యేకమైన అంశం. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్థన్‌ రెడ్డి, టీడీపీ నేత, మున్సిపల్‌ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిలు వేర్వేరు వార్డుల్లో పోటీ చేస్తున్నారు. తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ పదవి జనరల్‌ కావడంతో పెద్దారెడ్డి, జేసీ కుటుంబాలు ఆ పదవిని కైవసం చేసుకునేందుకు పావులు కదిపాయి.

మున్సిపల్‌ ఎన్నికలలో పోటీ చేయబోమని, ఎన్నికలను బహిష్కరిస్తున్నామనే ప్రకటన నుంచి.. తాడో పేడో తేల్చుకునే వరకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి రాజకీయాన్ని నడిపారు. నామినేషన్ల దాఖలు నుంచి ప్రచారం వరకూ అనేక వివాదాలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం జరుగుతున్న పోలింగ్‌ కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

గత ఏడాది మార్చిలో మున్సిపల్‌ ఎన్నికలను నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు.. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని, తమ పార్టీ తరఫున ఎవరూ పోటీ చేయబోరని జేసీ ప్రభాకర్‌ రెడ్డి ప్రకటించారు. అయితే మరికొద్ది రోజులకు తన నిర్ణయాన్ని మార్చుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తున్నామని ప్రకటిచండమే కాకుండా.. అనూహ్యంగా ఆయనే కౌన్సిలర్‌గా బరిలో దిగారు. అదీ కూడా పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్థన్‌ రెడ్డి పోటీ చేసే 30వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు జేసీ ప్రకటించారు. దీంతో తాడిపత్రి పోరు రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో నా కొడుకుని నువ్వు ఓడించావు.. మున్సిపల్‌ ఎన్నికల్లో నీ కొడుకును నేను ఓడిస్తాననేలా జేసీ ప్రభాకర్‌ రెడ్డి తన స్థాయిని తగ్గించుకుని మరీ కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

అయితే ఎన్నికలు వాయిదా పడిన తర్వాత పరిస్థితి మారింది. పెద్దారెడ్డి కుమారుడుపె పోటీ చేసే విషయంలో ఒక అడుగు వెనక్కి తగ్గిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి… మరో వార్డు నుంచి పోటీకి దిగారు. పెద్దారెడ్డి కుమారుడును ఓడించడం కన్నా.. మున్సిపాలిటీని కైవసం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే వార్డు మారి పోటీలో నిలిచారు. కౌన్సిలర్‌గా గెలిచి మళ్లీ చైర్మన్‌ పీఠంపై కూర్చోవాలనే లక్ష్యంతో జేసీ ప్రభాకర్‌ రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల్లో పని చేశారు.

Also Read : జేసీకి తత్త్వం బోధపడిందా లేక రాజకీయ చతురత్వం చూపుతున్నాడా ?

మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు పట్టణంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి నయా ప్లాన్‌ను అమలు చేశారు. ఇప్పటికే పలుమార్లు చైర్మన్‌గా చేసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. ఈ సారి కూడా టీడీపీ గెలిస్తే చైర్మన్‌ అవుతారనే భావన అందరిలోనూ ఉంది. అయితే అనూహ్యంగా జేసీ వ్యూహం మార్చారు. తాను చైర్మన్‌ పదవి తీసుకోబోనని, అన్ని వర్గాల వారికి ఏడాదికి ఒకరు చొప్పన చైర్మన్‌ పదవిని కట్టబెడతానని ప్రకటించారు. బీసీ, ఎస్సీ, మైనారిటీ సహా ప్రధాన కులాల కౌన్సిలర్లను ఏడాది కాల పరిమితితో చైర్మన్‌ సీటులో కూర్చునే అవకాశం కల్పిస్తామని ప్రచారం చేశారు.

చైర్మన్‌గా ఎవరు ఉన్నా.. పెత్తనం చేసేది జేసీ ప్రభాకర్‌ రెడ్డేనని అందిరికీ తెలిసిన విషయమే. అయినా.. ఈ తరహా వ్యూహం వేయడంలో మున్సిపాలిటీని గెలుచుకుని మళ్లీ రాజకీయంగా చక్రం తిప్పాలనేదే జేసీ లక్ష్యంగా కనిపిస్తోంది.

36 వార్డులు ఉన్న తాడిపత్రిలో రెండు వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 30వ వార్డులో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్థన్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 34 వార్డుల్లో పోటీ జరుగుతోంది. 19 వార్డులు గెలుచుకున్న పార్టీ మున్సిపాలిటీలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తుంది.

కేసులు ఎందుకు పెట్టారనే కారణం ప్రస్తావించకుండా.. ప్రభుత్వం తమను వేధిస్తుందనేలా ప్రచారం చేస్తూ తాడిపత్రి ప్రజల నుంచి సానుభూతి పాందే ప్రయత్నాలను కొంత కాలంగా జేసీ సోదరులు చేశారు. స్థానికంగా సాధించిన పట్టు, వైఎస్‌జగన్‌ సంక్షేమ పాలన నేపథ్యంలో గెలుపుపై పెద్దారెడ్డి వర్గం ధీమాగా ఉంది. మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ పెద్దారెడ్డి పట్టు నిలుపుకుంటారా..? జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఉనికి కాపాడుకుంటారా..? అనేది ఈ నెల 14వ తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో తేలిపోతుంది.

Show comments