iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న మునిసిపల్ స్థానాల ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడబోతున్నాయి. కౌంటింగ్ ప్రారంభం కావడంతో మరింత ఉత్కంఠ కనిపిస్తోంది. ఎక్కడ, ఎవరు పాగా వేస్తారోననే చర్చ సాగుతోంది. అయితే ఈసారి అనూహ్యంగా కొన్ని మునిసిపాల్టీలు, నగర పంచాయతీలకు సంబంధించి ప్రతిపక్షం కనీసం బోణీ కొట్టేనా అనే చర్చ సాగుతుండడం విశేషం. గతంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కేవలం తాడిపత్రి మాత్రమే గెలవగలిగిన టీడీపీ ఈసారయినా ఖాతా తెరుస్తుందా అంటే సందేహంగానే ఉంది. కుప్పం సహా అన్ని చోట్లా ఆపార్టీకి ఎదురుదెబ్బలు ఖాయమనే అంచనాలున్నాయి.
నెల్లూరు నగర పాలక సంస్థతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి తో పాటుగా ప్రకాశం జిల్లా దర్శి, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు జిల్లా కుప్పం, కడప జిల్లా కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లా పెనుగొండ, కర్నూలు జిల్లా బేతెంచర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కేవలం ఆకివీడు మినహా ఎక్కడా టీడీపీ, ఇతర విపక్షాలకు ఆశలు లేవు. ఆకివీడు మీద గట్టి ఆశలు పెట్టుకుని టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం సహా అన్ని పార్టీలు ఏకమయినప్పటికీ ఆశించిన ఫలితం దక్కే అవకాశం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇక కుప్పంలో కూడా టీడీపీ ఖాళీ కావడం అనివార్యంగా చెప్పవచ్చు. ఇప్పటికే టీడీపీ శిబిరం నైరాశ్యంలో మునిగిపోయింది. ఒక వార్డు ఏకగ్రీవం కాగా మిగిలిన 24 వార్డుల్లో నాలుగైదు వార్డులు మినహా మిగిలినవన్నీ పాలకపక్షం చేతిలో చేరిపోతాయనే అభిప్రాయం వినిపిస్తోంది. నెల్లూరు నగర పాలక సంస్థ కూడా అదే పరిస్థితి. 8 డివిజన్లు ఏకగ్రీవం కావడం వెనుక టీడీపీలో సమన్వయం లేకపోవడమే పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. ఎన్నికలు జరిగిన డివిజన్లు కూడా అదే తంతు. ఇక బుచ్చిరెడ్డిపాలెంలో అయితే టీడీపీ బోణీ కొట్టే అవకాశాలు లేవని సమాచారం. వైఎస్సార్సీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టు కనిపిస్తోంది. పెనుకొండలో కూడా దాదాపు అదే పరిస్థితి.
మిగిలిన అన్ని మునిసిపాలిటీలలో కూడా టీడీపీ ఏమేరకు ప్రభావం చూపుతుందన్నది ప్రశ్నార్థకంగా ఉంది. అన్ని చోట్లా ఒకటి రెండు సీట్లు మినహా పెద్దగా ప్రభావం చూపలేదని టీడీపీ నేతలే అంచనా వేస్తుండడంతో తుది ఫలితాల్లో ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరమే. ఏమయినా ఇంత పెద్ద హడావిడి చేసిన తర్వాత కూడా, భారీగా నేతలు కేంద్రీకరించినా గానీ ఫలితాల్లో మార్పులు రాకపోవడం టీడీపీని కలవరపెట్టే అంశం. తుది ఫలితాలు వెలువడిన తర్వాత ఎలాంటి స్పందనలు వస్తాయో చూడాలి.