iDreamPost
android-app
ios-app

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు మనవాడే.. కోట్ల సంపద!

  • Published Jul 06, 2023 | 12:25 PM Updated Updated Jul 06, 2023 | 12:25 PM
  • Published Jul 06, 2023 | 12:25 PMUpdated Jul 06, 2023 | 12:25 PM
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు మనవాడే.. కోట్ల సంపద!

రోడ్డు పక్కన, గుడి దగ్గర, ట్రాఫిక్‌ ఇగ్నల్‌ వద్ద.. మాసిన బట్టలు, సరైన పోషణ లేని శరీరంతో.. ప్రపంచంలో ఉన్న దైన్యం అంతా వారి ముఖాల్లోనే చూపిస్తూ.. అత్యంత దీనంగా బాబు ధర్మం చేయండి అంటూ చేయి చాచిన వారిని చూసి ఎవరికైనా మనసు కరగక మానదు. అ‍య్యో పాపం అనుకుని.. తోచినంత వారికి దానం చేస్తాం. అయితే ఇలా అడుక్కునే వారిలో అందరూ పేదవాళ్లు, నిజంగా అభాగ్యులే ఉంటారా అనుకుంటే బొచ్చెలో కాలేసినట్లే. చూడటానికి వీరు బిచ్చగాళ్లే కానీ.. వీరిలో ఎంత మంది లక్షాధికారులు ఉన్నారో మనకు తెలియదు. వీరి భిక్షాటన చేస్తున్నప్పటికి.. కుటుంబ సభ్యులు మంచి ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు.. పైగా వీరిలో కొందరి నెల సంపాదన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు మించి ఉంటుంది అన్నా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఇలాంటి సంఘటనలు మనం అనేకం చూశాం. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడి గురించి తెలుసుకుందాం. పైగా అతడు మన దేశానికే చెందిన వాడే కావడం గమనార్హం. ఆ వివరాలు..

ఓ ఆంగ్ల మీడియా రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు మన దేశానికి చెందిన భరత్ జైన్. ఇతడు ముంబయిలోని పాష్‌ ఏరియాల్లో భిక్షాటన చేస్తూ కోట్లు గడిస్తున్నాడు. కోట్లకు కోట్లు సంపాదించినా ఇప్పటికీ యాచకవృత్తిని మాత్రం విడిచిపెట్టకపోవడం మనార్హం. తొలుత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా.. యాచక వృత్తిలోకి అడుగుపెట్టాడు భరత్ జైన్. దాంతో అతడు తన చదువు కొనసాగించలేకపోయాడు. ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. ప్రస్తుతం తండ్రి, సోదరుడు కూడా ఇతడితోనే కలిసి ఉంటున్నారు.

తొలుత భరత్‌ జైన్‌ భిక్షాటన చేసి తెచ్చిన ఆదాయం కుటుంబం గడవడానికి కూడా సరిపోయేది కాదు. దాంతో భిక్షాటన చేసే ప్లేస్‌ మార్చాడు. అలా అతడి ఫేట్‌ కూడా మారింది. ఆదాయం పెరిగింది.. అన్ని సౌకర్యాలు అమర్చాడు. పిల్లలను మంచి స్కూల్లో జాయిన్‌ చేసి చదివిస్తున్నాడు. ప్రస్తుతం భరత్‌ జైన్‌ నికర సంపద సుమారు రూ.7.5 కోట్లు ఉంటుందని సమాచారం. భిక్షాటనతోనే నెలకు రూ.60 వేల నుంచి 75 వేల రూపాయల వరకు సంపాదిస్తాడట. ఇది ఎందరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతం కంటే ఎక్కువే ఉంటుందని చెప్పొచ్చు.

భరత్ జైన్ ఆస్తుల విషయానికి వస్తే .. అతడికి ముంబయిలో రూ.1.2 కోట్ల విలువ చేసే డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ ఉంది. రియల్ ఎస్టేట్‌లోకి కూడా ప్రవేశించాడు. ఠాణెలోని తనకు ఉన్న రెండు షాప్‌లను అద్దెకు ఇవ్వడం ద్వారానే నెలకు రూ.30 వేల వరకు సంపాదిస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి పరేల్‌లోని ఓ డూప్లెక్స్‌లో నివాసముంటున్నాడు. పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఇక భరత్‌ జైన్‌ కుటుంబంలోని మిగతావారు స్టేషనరీ హౌస్ నిర్వహిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు.

అయితే జైన్ ఎక్కడపడితే అక్కడ భిక్షాటన చేయడు. ప్రముఖ పర్యటక ప్రదేశాలైన ఛత్రపతి శివాజీ టెర్మినల్‌, ఆజాద్ మైదాన్ వంటి చోటే కనిపిస్తాడు. ఇప్పుడు తన దగ్గర ఇంత సంపద ఉన్నప్పటికీ భిక్షాటన చేయడం మాత్రం మానలేదు. కుటుంబసభ్యులు అడుక్కోవడం మానేయమని చెప్పినా భరత్ జైన్ ఆ సలహాను విస్మరిస్తూనే వచ్చాడు. మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.