iDreamPost
android-app
ios-app

ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ రిపోర్ట్

ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ రిపోర్ట్

మళయాలం సినిమాలు గతంలో చూడాలంటే డబ్బింగ్ రూపంలో థియేటర్లో అయినా రావాలి లేదా సబ్ టైటిల్స్ సహాయంతో ఏదైనా ఓటిటిలో ప్లాన్ చేసుకోవాలి. ఒక్కోసారి ఈ రెండు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఆ కొరతను తీరుస్తూ నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ లాంటి సంస్థలు అనువాదం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ రోజు నాడే తెలుగు ఆడియో కూడా ఇచ్చేస్తున్నారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మన బాషలోనే ఎంజయ్ చేసే అవకాశం దక్కింది. ఈ క్రమంలో వచ్చిందే ముకుందన్ ఉన్ని అసోసియేట్స్. సోషల్ మీడియాలో జనాలు మెచ్చుకుంటున్న ఈ సినిమా రిపోర్ట్ చూద్దాం

ముకుందన్(వినీత్ శ్రీనివాసన్)వయసు నలభై దాటినా లాయర్ గా కెరీర్ లో సెటిల్ కాక ఇబ్బంది పడుతుంటాడు. ఓసారి తల్లికి చిన్న ప్రమాదం జరిగితే ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు అక్కడో స్కామ్ కనిపిస్తుంది. యాక్సిడెంట్లు జరిగినప్పుడు తప్పుడు పత్రాలతో ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేసి కోట్లు సంపాదిస్తున్న న్యాయవాది వేణు(సూరజ్ వెంజరమూడు) పరిచయమవుతాడు. ఎలాగైనా ఆ మాఫియా హస్తగతం చేసుకోవాలని వేణుని హత్య చేసి ఆ స్థానాన్ని దక్కించుకుంటాడు. ఆ తర్వాత మెల్లగా ఏజెంట్ల సహాయంతో కేసులు పట్టేసి క్రమంగా కోట్లకు పడగలెత్తుతాడు. స్వార్థంతో నిండిన ఇతని జీవితం చివరికి ఏ మలుపు తీసుకుందో స్క్రీన్ పై చూడాలి

2014లో వచ్చిన హాలీవుడ్ మూవీ నైట్ క్రాలర్ ఆధారంగా దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్ ఈ కథను వినూత్నంగా రాసుకున్నాడు. ఇందులో హీరో ఉండడు. కేవలం విలన్ ఆడే ఆట మాత్రమే కనిపిస్తుంది. నెమ్మదిగా మొదలైనప్పటికీ ఆసక్తి కలిగించే సన్నివేశాలతో అభినవ్ టేకింగ్ ప్రశంసలు దక్కించుకుంది. లాజిక్స్ ని కొన్ని విషయాల్లో వదిలేశారు కానీ బయట ప్రపంచానికి అంతగా తెలియని ఇన్సురెన్స్ దందాని చక్కగా చూపించారు. సెకండ్ హాఫ్ లో కథనం పరుగులు పెడుతుంది. మోసం చేస్తేనే గెలుస్తామనే మెసేజ్ అందరికీ నచ్చకపోవచ్చు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ ఓ మోస్తరుగా మెప్పించేస్తుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి