భారతదేశపు అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనకు, తన కుటుంబానికి రెండో ఇంటిని నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవును మీరు విన్నది నిజమే కానీ ఈ ఇల్లు ఇండియాలో కాదు విదేశాల్లో. మిడ్ డే అనే ఒక అంతర్జాతీయ వెబ్ సైట్ నివేదిక ప్రకారం, ముఖేష్ అంబానీ లండన్‌లో తన రెండవ ఇంటిని నిర్మిస్తున్నారు. లండన్‌లోని బకింగ్‌హామ్‌షైర్‌లో 300 ఎకరాల స్టోక్ పార్క్‌ను ముఖేష్ అంబానీ కొనుగోలు చేశారట, దీంతో ఇప్పుడు ముఖేష్ అంబానీ అక్కడికి వెళ్లి సెటిల్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. లండన్‌లోని బకింగ్‌హామ్‌షైర్‌లో ఉన్న ఈ 300 ఎకరాల ఆస్తిని ముఖేష్ అంబానీ ఈ ఏడాది ప్రారంభంలో రూ. 592 కోట్లకు కొనుగోలు చేశారని అంటున్నారు.
జేమ్స్ బాండ్ సినిమాలో కూడా
అంతేకాక ఈ ఆస్తికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. ఈ ఇల్లు గతంలో వ్యక్తిగత నివాసంగా ఉండేది కానీ 1908 తర్వాత, ఇది కంట్రీ క్లబ్‌గా మార్చబడిందట. అంతే కాక మీడియా కథనాల ప్రకారం, జేమ్స్ బాండ్ చిత్రం కూడా ఇక్కడ చిత్రీకరించబడింది. ఇక స్టోక్ పార్క్ ప్రాపర్టీలో 49 బెడ్‌రూమ్‌లు, మెడికల్ సదుపాయం, ఇతర విలాసవంతమైన వస్తువులు ఉంటాయని నివేదికలో ఉంది. అంతేకాక వారి ముంబై ‘యాంటిలియా’ని ప్రతిబింబించే ఒక మందిరం కూడా ఉందట. ఇక ఇప్పటికే తమ అవసరాలకు అనుగుణంగా దానిని సిద్ధం చేస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఇక ఈ సంవత్సరం దీపావళికి అంబానీ ఫ్యామిలీ వారి కొత్త ఇంటికి వెళ్లిందట, వారు సాధారణంగా ముంబై ‘యాంటిలియా’లో ఈ దీపావళి జరుపుకుంటారు. దీపావళిని జరుపుకున్న తర్వాత, అంబానీలు భారతదేశానికి తిరిగి వస్తారని అంటున్నారు. అంతా సెట్ అయిన తర్వాత వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వారి కొత్త లండన్ మాన్షన్‌కు తిరిగి వెళ్తారట.
Also Read : Sharukh Aryan Drugs Case – ఆర్యన్ ఖాన్ కేసు నుంచి వాంఖడే అవుట్.. ఎందుకబ్బా?
అయితే స్టాక్ పార్క్ ఎందుకు?
నివేదికల ప్రకారం, కుటుంబం స్థలం పరంగా మరింత ఓపెన్‌గా ఉండాలని కోరుకుందని, ముంబైలో ఉన్న వారి నిలువు భవనం ‘యాంటిలియా’ లాంటిది కాకుండా సువిశాల ఇంటి కోసమే ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు. ముంబైలో ఉన్న అత్యంత ఖరీదైన పరిసరాల్లో ఒకటైన ఆల్టామౌంట్ రోడ్‌లో ఉన్న వారి ‘యాంటిలియా’లో అంబానీలు లాక్‌డౌన్‌లు మరియు మహమ్మారి సమయంలో ఎక్కువ సమయం గడిపిన తర్వాత, ఆ కుటుంబం తమకు కావాలనుకునే ప్రశాంతంగా ఫ్రీగా బ్రతకడానికి రెండో ఆస్తి అవసరమని గ్రహించి కొత్త ఇల్లు సిద్ధం చేస్తున్నారని నివేదికల్లో పేర్కొన్నారు.
సెక్యూరిటీ కారణాలు?
అయితే నిజానికి ఈ ఏడాది మొదట్లో యాంటీలియా భవనం వద్ద స్కార్పియో కారు కలకలం రేపింది. పచ్చ రంగు ఉన్న ఆ కారులో జిలెటిన్ స్టిక్స్ లాంటి పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ అంబానీ ఇంటి వద్ద పార్క్ చేసి ఉండడంతో అనుమానాస్పదంగా అనిపించిన భవనం సెక్యూరిటీ గార్డులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ కూడా వెంటనే రంగంలోకి దిగి ఆ కారును పరిశీలించి, కారులో జిలెటిన్ స్టిక్స్ గుర్తించారు. ముంబైలో హై సెక్యూరిటీ జోన్లలో ఒకటి అయిన ఈ ప్రాంతంలో, దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ ఇంటి వద్ద జిలెటిన్ స్టిక్స్ తో ఉన్న కారు ఉండడం పెద్ద సంచలనంగా మారింది. దీంతో ఇండియా సేఫ్ కాదనే ఉద్దేశానికి కూడా వచ్చారా? అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Also Read :Demonetisation-దేశం డిజిటలైజేషన్ అయిపోయిందా. చలామణిలో ఉన్న నగదు లెక్కలేంటి?
కొన్నాం కానీ అందుకు కాదు!
ఇలా మీడియాలో వార్తలు వస్తున్న క్రమంలో రిలయన్స్ స్పందించింది. ఇవన్నీ నిరాధార వార్తలు అని చెప్పుకొచ్చింది. రిలయన్స్ ప్రకారం, అంబానీ కుటుంబం లండన్‌లోని స్టోక్ పార్క్‌లో స్థిరపడేందుకు ఎలాంటి సన్నాహాలు చేయడం లేదట. అంబానీ కుటుంబం వేరే దేశానికి వెళ్లే ఆలోచనలో లేదని కూడా ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే రిలయన్స్ గ్రూప్ కంపెనీ ఆర్‌ఐఐహెచ్‌ఎల్ స్టోక్ పార్క్‌ను అయితే కొనుగోలు చేసినట్లు ఒప్పుకుంది. ఈ హెరిటేజ్ ప్రాపర్టీ సహాయంతో ప్రీమియర్ గోల్ఫ్ సహా క్రీడలను ప్రోత్సహించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించింది.