iDreamPost
iDreamPost
కోట్లాది అభిమానులున్న స్టార్ హీరో కుటుంబంలో హీరోలను ఒకేసారి తెరమీద చూడాలనిపించడం సహజం. కాకపోతే సరైన కథ దర్శకుడు పడాలి. ముగ్గురు కొడుకులు ఆ కోవలోకి వస్తుంది. ఆ సంగతులు చూద్దాం. 1988 సంవత్సరం. సూపర్ స్టార్ కృష్ణ తల్లి గారు నాగరత్నమ్మకి తన సంతానం ముగ్గురు కొడుకులు కాబట్టి ఆ పేరుతో ఒక సినిమా తీయాలని కోరికగా ఉండేది. దాని కోసం టైటిల్ కూడా రిజిస్టర్ చేయించి పెట్టారు. కానీ కథ సెట్ కాలేదు. ఎవరికో చెప్పి లాభం లేదని తల్లి కోరిక తీర్చేందుకు కృష్ణ స్వయంగా రంగంలోకి దిగి పి చంద్రశేఖర్ రెడ్డి, భీశెట్టిలు తయారు చేసిన కథకు పరుచూరి బ్రదర్స్ ని స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పారు. తాను, రమేష్ బాబు, స్కూల్ లో చదువుకుంటున్న మహేష్ బాబు ముగ్గురం ఉండేలా తండ్రి కొడుకుల్లా కాకుండా అన్నదమ్ముల్లా కాన్సెప్ట్ రెడీ అయ్యింది.
షూటింగ్ దాదాపుగా ఊటీలోనే చేశారు. మహేష్ చదువుకు ఆటంకం కలగకుండా ఎక్కువ కాల్ షీట్స్ లేకుండా స్వీయ దర్శకత్వంలో దీన్ని తెరకెక్కిస్తున్న కృష్ణ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. తనకు జోడిగా రాధను, రమేష్ బాబుకి బాలీవుడ్ బ్యూటీ సోనమ్ ని సెట్ చేశారు. సత్యనారాయణ, గుమ్మడి, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు, మురళీమోహన్, చలపతిరావు తదితరులు ప్రధాన తారాగణంగా ఎంపికయ్యారు. చక్రవర్తి సంగీతం సమకూర్చగా విఎస్ ఆర్ స్వామి ఛాయాగ్రహణం అందించారు. పద్మాలయా స్టూడియోలో కొంత భాగం తప్ప మిగిలిందంతా ఊటీలోనే అనుకున్న టైంలో షూటింగ్ మొత్తం పూర్తి చేశారు కృష్ణ. కుమార్తె ప్రియా కూడా ఇందులో పాత్ర చేశారు
ఇది మరీ కొత్త కథేమీ కాదు. ఎన్టీఆర్ బాలయ్య మురళీమోహన్ కాంబోలో వచ్చిన అన్నదమ్ముల అనుబంధం పాయింట్ నే తీసుకుని ఆ టైంలో ఆడియన్స్ అభిరుచులు అంచనాలకు తగ్గట్టు కీలక మార్పులు చేశారు. మహేష్ బాబు అంత చిన్న వయసులోనే అల్లూరి సీతారామరాజు గెటప్ లో చెప్పిన డైలాగులు ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాయి. కృష్ణతో పాటు ఆయన ఇద్దరు అబ్బాయిలు కలిసి నటించిన మొదటి సినిమా ఇదే. 1988 అక్టోబర్ 20న బాలకృష్ణ రాముడు భీముడుతో పాటు ముగ్గురు కొడుకులు ఒకే రోజు విడుదలై ఘన విజయం అందుకుంది. తల్లి కోరికను సూపర్ హిట్ అందించడం ద్వారా కృష్ణ నెరవేర్చారు. తమ తొలి కలయిక ఈ స్థాయిలో విజయం సాధించడం చూసి రమేష్ బాబు, మహేష్ బాబులతో పాటు అభిమానులు సైతం చాలా సంతోషించారు
Also Read : Vijetha : కుటుంబం కోసం కిడ్నీ త్యాగం – Nostalgia