iDreamPost
iDreamPost
త్వరలోనే రాజీనామా చేసేస్తా.. నాపై అనర్హత వేటు వేయించేందుకు వారికి కొంత సమయం ఇస్తున్నాను.. వారు చేయలేకపోతే నేనే రాజీనామా చేస్తా’.. అంటూ నరసాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో భిన్న వ్యాఖ్యలు, విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా సొంత పార్టీకి ద్రోహం చేస్తూ ఇప్పుడు అనర్హత వేటు కోసం ఎదురు చూస్తున్నాననడమేమిటి? అంత సరదాగా ఉంటే వైఎస్సార్సీపీ ఎంపీలో స్పీకరుకు ఫిర్యాదు చేసినప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకించినట్లు.. దానిపై కోర్టుకు ఎక్కడమెందుకు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనర్హత వేటు వేయించలేకపోతే తానే రాజీనామా చేస్తానని రఘురామ చెప్పడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అంతవరకు ఎందుకు ఆగడం.. ఇప్పుడే రాజీనామా చేస్తే ఓ పనైపోతుంది కదా.. మీ వల్ల రెండున్నరేళ్ళలో నరసాపురం నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని అక్కడి ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.
సొంత పార్టీకి ద్రోహం.. ప్రత్యర్థులతో చెట్టపట్టాలు
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణంరాజు సొంత పార్టీకే ద్రోహం తలపెట్టారు. నొసలు చిట్లించి నోటితో పొగిడిన చందంగా సీఎం జగన్ పై అభిమానం ఉందంటూ.. ఆయన కేసుల నుంచి త్వరగా బయటపడాలన్న సుదుద్దేశంతోనే జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నానంటూ కేసులు వేశారు. దీన్ని సీబీఐ కోర్టు కొట్టివేస్తే తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. ఆధారాలు లేకుండా, సంబంధం లేకుండా కేసులు ఎలా వేస్తారని కోర్టు తీవ్రంగా మందలించినా రఘురామ తీరు మారలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలన్నింటిపైనా కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డంపడటమే పనిగా పెట్టుకున్నారు. అంతేకాకుండా పత్రిక ప్రకటనల రూపంలో ప్రభుత్వాన్ని, సొంత పార్టీని నిత్యం విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకే వస్తాయని.. అందువల్ల ఎంపీపై వేటు వేయాలని స్పీకరుకు ఫిర్యాదు చేస్తే దాన్ని వ్యతిరేకించిన ఆయనే ఇప్పుడు అనర్హత వేటు వేయించేందుకు సమయం ఇస్తానంటుండటం విడ్డురంగా ఉంది.
Also Read : కొందరి అధికారమదం..సామాన్యుల బలి
తనను ఎంపీని చేసిన పార్టీ నిర్ణయాలను కాదని ప్రతిపక్ష టీడీపీతో చేతులు కలపడం, తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభలో చంద్రబాబుతో చెట్టపట్టాలు వేసుకుని సొంత పార్టీని, దాని అధ్యక్షుడిని విమర్శించడానికి మించిన ద్రోహం ఏముంటుంది? అది నైతిక విలువలకు నీళ్లు వదలడం కాదా? కావాలనుకుంటే ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. పోరాటం చేస్తే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు కదా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీకి సుద్దులు చెప్పే రఘురామకు మాత్రం అనైతిక పోరాటమే మిన్నగా కనిపించినట్లుంది.
ఏం చేశారని.. మళ్లీ గెలిపిస్తారు?
రఘురామ ఎంపీగా ఎన్నికై రెండున్నరేళ్లు గడిచాయి. గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గానికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ప్రజల సమస్యలు అసలు పట్టించుకోలేదు. ఈ తరుణంలో రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని రఘురామ ప్రగల్బాలు పలుకుతున్నారు.
ఆనాడు జగన్ ను చూసి గెలిపించిన ప్రజలు..
నియోజకవర్గాన్నే పట్టించుకోకుండా, జగన్ నే విమర్శిస్తున్న అతన్ని గెలిపించడానికి కాదు గానీ బుద్ధి చెప్పడానికి మాత్రం సిద్దంగా ఉన్నారు. అమరావతి అజెండాతో పోటీ చేసి గెలవడం ద్వారా ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో చూపిస్తానని రఘురామ పేర్కొనడం హాస్యాస్పదం. రాష్ట్రానికి అమరావతి ఎజెండా కొత్తది కాదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే అజెండాతో పోటీ చేసిన టీడీపీకి ప్రజలు చుక్కలు చూపించడం, తర్వాత గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అమరావతి ప్రాంతం సహా రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీని ప్రజలు గెలిపించిన విషయాన్ని రఘురామకృష్ణంరాజు మరచిపోయారేమో గానీ ప్రజలందరికీ ఇంకా గుర్తుంది. అందువల్ల ఆయన ఎంత వేగంగా రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే అంత వేగంగా ఆయనకు క్లారిటీ ఇచ్చేందుకు నరసాపురం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Also Read : వీర్రాజు ఇంత వేగంగా మారిపోయారేమీ..?