iDreamPost
iDreamPost
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివాజ్ సింగ్ చౌహాన్ ఖజురహో విమానాశ్రయంలో ఉన్నప్పుడు టీ ఆడిగారు. టీ వచ్చింది. కాని అది చల్లగా ఉంది. సీఎంకు చల్లటి టీ నివ్వడమా? ఎంతటి అపచారం? కోల్డ్ టీ అందించినందుకు, ప్రభుత్వ అధికారికి షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా, టీ, స్నాక్స్ ఏర్పాటు చేసిన ఆహార సరఫరా అధికారి రాకేష్ కన్హువా నోటీసులు అందుకున్నారు.
టీ చల్లగా ఉంటే నోటీసులిస్తారా? విమర్శలొచ్చాయి. సోషల్ మీడియాలో ఉతికి ఆరేశారు. సీఎంకు కోల్డ్ టీ అందించినందుకు, ప్రభుత్వ అధికారికి జారీ చేసిన షోకాజ్ నోటీసును, మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా యంత్రాంగం ఉపసంహరించుకుంది.
ప్రజలకు రేషన్ దొరకకపోయినా పర్వాలేదు. అంబులెన్స్ రాలేకపోవచ్చు. కానీ సీఎం మాత్రం చల్లటి టీ తాగలేరని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి విమర్శించారు. రాష్ట్ర అధికార బీజేపీ కూడా షోకాజ్ నోటీసును ఉద్యోగి వ్యక్తిగత ద్వేషంగా అభివర్ణించింది.
చౌహాన్ చాలా సాధారణంగానే ఉంటారు. మధ్యలో అధికారుల హడావిడి వల్లే సమస్యలని బీజేపీ అంటోంది. సింప్లిసిటీని ఇష్టపడే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ టీ చల్లగా ఉందని ఫిర్యాదుచేసే తత్త్వం కాదని వెనకేసుకొస్తోంది.
షోకాజ్ నోటీసులో ఏం చెప్పారంటే…“ముఖ్యమంత్రికి నాసిరకం భోజనం (స్నాక్స్) వడ్డించారని మాకు తెలిసింది. అలాగే, ఆయనకు అందించే టీ చల్లగా ఉందని, జిల్లా యంత్రాంగం ప్రవర్తన బాధ్యతాయుతంగా లేదు. సిఎం ప్రోటోకాల్‌ను నిర్వహించడం. వివిఐపి సేవలను క్యాజువల్‌గా తీసుకోవడం వల్ల ఇది జరిగింది”.
మీపై ఎందుకు ఎటువంటి క్రమశిక్షణా చర్య తీసుకోకూడదని నోటీసు ప్రశ్నించింది. దీనిపై విమర్శలు రావడంతో, బుధవారం ఛతర్‌పూర్ జిల్లా కలెక్టర్ సందీప్ జీఆర్ ద్వివేది ఇచ్చిన నోటీసును రద్దు చేశారు.
ఖజురహో లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ అయిన చౌహాన్ , ఎంపీ బీజేపీ అధ్యక్షుడు V D శర్మ సోమవారం ఖజురహో పర్యటనలో ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన తర్వాత, వీరిద్దరూ పట్టణ సంస్థల ఎన్నికల ప్రచారం కోసం కట్నీకి బయలుదేరారు. ఆ సమయంలో ఈ వివాదం రేగింది.