iDreamPost
iDreamPost
సినిమా టికెట్లను వీలైనంత తక్కువ రేటుకే అందించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందుకు గాను ప్రభుత్వం తరపునే సినిమా టికెట్లు అమ్మాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బుక్ మై షో లాంటి యాప్స్ జనాలని నిలువు దోపిడీ చేస్తున్నాయి. వాటి వల్ల ఒక్కో టికెట్ కి 20 నుంచి 25 రూపాయల వరకు భారం పెరుగుతుంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APFDC) ఆధ్వర్యంలో ‘యువర్ స్క్రీన్స్’ అనే పోర్టల్ ద్వారా ఇకపై సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారని ఆ సంస్థ ఎండీ టి.విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇతర ఆన్‌లైన్ పోర్టళ్ల ద్వారా సినిమా టికెట్ బుక్ చేసుకుంటే ఒక్కో టికెట్‌పై ప్రేక్షకుడికి అదనంగా రూ.20 నుంచి రూ.25 వరకూ భారం పడుతుంది. అదే యువర్ స్క్రీన్స్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ధరపై 1.95 శాతం మాత్రమే సర్వీస్ ఛార్జ్ ఉంటుందని తెలిపారు.
అలాగే ఒప్పందం చేసుకునే థియేటర్లకు టికెట్ల డబ్బులు ఏ రోజుకు ఆ రోజే చెల్లిస్తాం. థియేటర్లు ఇతర ఆన్‌లైన్ పోర్టళ్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు అవ్వవు. వాటితో పాటు యువర్ స్క్రీన్స్ తో కూడా ఒప్పందాలు చేసుకోవచ్చు. త్వరలోనే ప్రభుత్వం తీసుకొచ్చిన యువర్ స్క్రీన్స్ ద్వారా ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అని యువర్ స్క్రీన్స్ సంస్థ ఎండి తెలిపారు.