సినిమా ఇండస్ట్రీ రంగుల వల! ఒక్కసారి ఈ వలలో పడ్డారంటే ఇక బయటపడ్డం కష్టం. తళుకుబెళుకులు పైపైనే! లోలోపల ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కట్లో! ఉన్నట్టుండి వచ్చిపడిన ఫేమ్ ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. దాన్ని నిలబెట్టుకోవాలన్న ఒత్తిడి పెరిగిపోతుంది. నా అన్న వాళ్ళ కోసం వెంపర్లాట మొదలవుతుంది. ప్రేమగా మాట్లాడిన వాళ్ళంతా మంచివాళ్ళలానే కనిపిస్తారు. కానీ అసలు విషయం అర్థమయ్యేసరికి శూన్యం ఆవహిస్తుంది. పేరు, డబ్బు, ఆఖరికి ప్రాణం కూడా ఎందుకూ పనికిరానివాటిలా కనిపిస్తాయి. చావు తప్ప మరో మార్గం లేదనిపిస్తుంది. సినిమాల్లోకొచ్చిన అందరి కథలూ ఇలా ఉండకపోవచ్చు. కానీ కొందరిలో జీవితాలు మాత్రం ఇలాగే ముగిసిపోయాయి. ఆ కొందరిలో వర్థమాన నటి మోనల్ నావల్ ఒకరు!
ఎవరీ మోనల్ నావల్?
మోనల్ నావల్ ప్రముఖ నటి సిమ్రాన్ చెల్లెలు. పుట్టింది ఢిల్లీలో. పూర్తి పేరు రాధామోనల్ నావల్. ఢిల్లీలో స్కూలింగ్ చేసిన మోనల్, ముంబయిలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ లోకి ఎంటరైంది. కొన్ని ఫ్యాషన్ షోస్, బ్యూటీ కంటెస్టుల్లో పాల్గొంది. అక్క ఆల్రెడీ సినిమాల్లో ఉండడం వల్లో ఏమో మోనల్ కి సినిమా చాన్సులు తొందరగానే వచ్చాయి.
2000 సంవత్సరంలో ఇంద్రధనుష్ అనే కన్నడ సినిమాతో మోనల్ తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2001లో విజయ్ పక్కన “బద్రి” అనే తమిళ సినిమాలో పని చేసింది. అయితే కునాల్ తో కలిసి నటించిన “పార్వై ఒండ్రె పోతుమే” అనే సినిమా దీని కంటే ముందు రిలీజైంది. మన తెలుగులో “ఇష్టం” సినిమాలో మోనల్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించింది. అంతేకాదు సన్నీడియోల్, టబు నటించిన బాలీవుడ్ మూవీ “మా తుఝే సలామ్” లో మోనల్, అర్బాజ్ ఖాన్ సరసన కశ్మీరీ ముస్లిం అమ్మాయిగా నటించింది. ఇలా రెండేళ్ళ వ్యవధిలోనే మోనల్ పదికి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ వాటిలో ఆడిన సినిమాలు అంతంతమాత్రమే!
మోనల్ ఎలా చనిపోయింది?
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రెండేళ్ళ తర్వాత అనుకోకుండా ఓ రోజు మోనల్ ఈ లోకాన్ని వీడింది. 2002, ఏప్రిల్ 14న చెన్నైలోని తన ఫ్లాట్ లో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయింది. అప్పుడు మోనల్ వయసు కేవలం 21 ఏళ్ళు. చనిపోయే టైంకి మోనల్ చేతిలో “దాదాగిరి” అనే తెలుగు సినిమా ఉంది. సుమన్ ఇందులో హీరో. అలాగే యుగేంద్రన్, ఈశ్వర్ తో కలిసి “బెస్టాఫ్ లక్” అనే తమిళ సినిమా చేయడానికి కూడా ఒప్పుకుంది. విచిత్రమేమంటే చనిపోయే రోజే మోనల్ తన కొత్త సినిమా “పయే జనమ్” ప్రారంభోత్సవంలో పాల్గొంది. “ఆత్మ జీవితం” అని దీని అర్థం!
మోనల్ ఎందుకు చనిపోయింది?
మోనల్ చావుకు కారణమేంటన్నది ఇప్పటికీ మిస్టరీనే. సినిమాలు ఆడకనో, సినిమాలు లేకనో ఆత్మహత్య చేసుకుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే చనిపోయేనాటికి ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి. మోనల్ అక్క సిమ్రాన్ వాదన ప్రకారం ప్రసన్న సుజిత్ అనే కొరియోగ్రాఫర్ మోనల్ చావుకు కారకుడు. చాలా కాలం మోనల్, సుజిత్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే కొన్నాళ్ళకు సుజిత్ ఆమెతో బంధం తెంచేసుకున్నాడు. ఇదే మోనల్ ఆత్మహత్యకు కారణమై ఉంటుందని అప్పట్లో సినీ వర్గాలు చెప్పుకున్నాయి. కానీ ఎవరూ దీన్ని కచ్చితంగా నిర్ధారించలేదు. అందుకే మోనల్ చావు ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది.