iDreamPost
android-app
ios-app

పంజాబ్ రైతుల నిరసన – వెనుదిరిగిన మోడీ

  • Published Jan 05, 2022 | 1:02 PM Updated Updated Mar 11, 2022 | 10:26 PM
పంజాబ్ రైతుల నిరసన – వెనుదిరిగిన మోడీ

దేశ ప్రధానమంత్రి పర్యటన అంటే మామూలు విషయం కాదు. పర్యటనకు రెండు మూడు రోజుల ముందే రూట్ క్లియరెన్స్ చేయడంతో పాటు ఎస్పీజీ బలగాలు ప్రధాని పర్యటన జరిగే ప్రాంతాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. ఇంత పకడ్బందీగా జరిగే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఆటంకం కలిగింది. రైతు సంఘాలు నిరసన తెలుపుతూ రహదారిని దిగ్బంధించడంతో ఒక ఫ్లై ఓవర్ పై ప్రధాని కాన్వాయ్ సుమారు 20 నిమిషాలపాటు చిక్కుకుపోయింది. అయినా ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో చివరికి ప్రధాని తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని వెనుదిరగాల్సి వచ్చింది. పంజాబ్ రాష్ట్రంలోని బటిండాలో జరిగిన ఈ ఘటనకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫలమే కారణమని కేంద్ర ప్రభుత్వం ఆరోపించడంతో అది రాజకీయ రంగు పులుముకుంది. దీన్ని తీవ్రమైన భద్రత వైఫల్యంగా కేంద్ర హోంశాఖ పరిగణిస్తోంది.

వర్షం కారణంగా రోడ్డు మార్గంలో..

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ లో రూ.42,750 కోట్లతో పలు ప్రాజెక్టులకు ప్రధానితో
శంకుస్థాపన చేయించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఫిరోజ్ పూర్, బటిండాల్లో పర్యటనకు వెళ్లారు. విమానంలో బటిండా చేరుకున్న ఆయన అక్కడి నుంచి అమరవీరుల స్మారకాన్ని సందర్శించేందుకు 30 కి.మీ. దూరంలోని కార్యక్రమ వేదిక వద్దకు హెలికాఫ్టర్ లో వెళ్లాల్సి ఉంది. అయితే భారీ వర్షం కురుస్తుండటం, వెలుతురు తక్కువగా ఉండటం వల్ల సుమారు అరగంట పాటు నిరీక్షించారు. అయినా పరిస్థితి మారకపోవడంతో రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించారు. దాంతో రాష్ట్ర డీజీపీ రూట్ చెక్ చేసి క్లియరెన్స్ ఇవ్వడంతో కేంద్ర హోమ్ శాఖ ప్రధాని కాన్వాయ్ ముందుకు సాగేందుకు అనుమతి ఇచ్చింది. కానీ కాన్వాయ్ బటిండా ఫ్లై ఓవర్ పైకి చేరుకునే సరికి కిసాన్ మజ్దూర్ సంఘర్ష కమిటీ ఆధ్వర్యంలో రైతులు మార్గాన్ని మూడు వైపుల నుంచి దిగ్బంధించారు. దాంతో ప్రధాని కాన్వాయ్ ఫ్లై ఓవర్ పై 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చివరికి మోదీ తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని వెనక్కి వెళ్లిపోయారు.

క్షేమంగా ఎయిర్ పోర్టుకు చేర్చినందుకు ధన్యవాదాలు:మోదీ

బటిండా విమానాశ్రయానికి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ ఈ ఘటనపై తనదైన శైలిలో స్పందించారు. క్షేమంగా విమానాశ్రయానికి చేరుకునేలా చేసిన మీ ముఖ్యమంత్రి చన్నీకి ధన్యవాదాలు చెప్పండి.. అని అక్కడున్న అధికారులతో ఆయన అన్నారు. కాగా ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ గా స్పందించింది. ప్రధాని పర్యటన విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించింది. సంఘటన జరిగిన తర్వాతైనా సీఎం కనీసం ప్రధానికి ఫోన్ చేయలేదని తప్పు పట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో తమ తప్పు ఏమీ లేదని స్పష్టం చేసింది. ప్రధాని పర్యటనను నేరుగా పర్యవేక్షించే ఎస్పీజీతో సహా కేంద్ర బలగాలు బాధ్యత వహించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా స్పష్టం చేశారు. కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్పందిస్తూ వేల కోట్ల ప్రాజెక్టుల వల్ల కాంగ్రెస్ ఓట్లకు గండి పడుతుందన్న భయంతోనే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాని పర్యటన జరగకుండా కుట్ర పన్నిందని ఆరోపించారు.