Idream media
Idream media
భవిష్యత్తులో తాను బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి పక్కలో బల్లెంలా మారారు. ఇప్పటికే తెలంగాణలో చతికిలపడ్డ కాంగ్రెస్‌కు అవకాశం వచ్చినప్పుడల్లా పార్టీలోని లోటుపాట్లను బహిర్గతం చేస్తూ శ్రేణుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. అధిష్ఠానం తప్పుడు నిర్ణయాల వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందంటూ విమర్శిస్తూ హీట్ పెంచుతున్నారు. తెలంగాణ రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులకు, కనీసం డిపాజిట్ కూడా రానివారికి రాష్ట్ర పార్టీ బాధ్యతలను అప్పగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. సందర్భమైనా.. అసందర్భంగానైనా సొంత పార్టీలోని లోపాలను ఎత్తిచూపుతుండడం చర్చనీయాంశం అవుతోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వేళ కూడా ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండడం కలకలం రేపుతోంది.
సీనియర్ల నిర్ణయం మేరకు టీపీసీసీ చీఫ్ నియామకంపై ప్రకటనను అధిష్ఠానం వాయిదా వేయడంపై గతంలో కోమటిరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు లింకు పెట్టి పీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని ఆపడం ఏమిటన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, అయినా రెండుసార్లు అధికారానికి ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఒడిసా, తమిళనాడు నాయకులకు ఇక్కడి పరిస్థితి ఏం తెలుస్తుందని పరోక్షంగా ఆర్‌సీ ఖుంటియా, మాణిక్కం ఠాగూర్‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక్కడే ఉన్న నాయకులను గుర్తించి వారికి భాద్యతలు అప్పగిస్తే బాగుంటుందన్నారు. పార్టీ అభివృద్ధి కోసం తాను చేస్తున్న కృషిని కాంగ్రెస్ అదిష్ఠానం గుర్తించడం లేదన్నారు. టీఆర్‌ఎస్ హవా కొనసాగుతున్న సమయంలో కూడా తాను ఎమ్మెల్యేగా గెలిచానని, భువనగిరి ఎంపీని గెలిపించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఇప్పుడు తాజాగా మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలోకి రమ్మని సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాలని, కొన్నిరోజులుగా బీజేపీ నేతలు అడుగుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్‌ను గద్దె దించాలంటే బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తాను బీజేపీ నుంచి పోటీచేస్తే కాంగ్రెస్ నేత జానారెడ్డికి మూడో స్థానానికి పరిమితమవుతారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తరచూ రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. అయినప్పటికీ దీనిపై పార్టీ ముఖ్యనేతలు పెద్దగా స్పందించడం లేదు. జీవన్‌రెడ్డి, వీహెచ్ వంటి నేతలు మాత్రం రాజగోపాల్ తీరును ఖండించారు. టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ తన బాధ్యతగా అధిష్ఠానానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి గతంలో ఆయన ఇంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలే రాజగోపాల్ రెడ్డి చేశారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ బలహీన పడిందని కూడా అన్నారు. రాహుల్‌గాంధీపైనా వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానానికి క్రమశిక్షణ చర్యల కమిటీ సిఫారసు చేసింది. కానీ, దీనిపై అధిష్ఠానం వద్ద అప్పటినుంచి నిర్ణయం పెడింగ్‌లోనే ఉంది. నాటినుంచి నేటిదాకా గాంధీభవన్ వైపు చూడని రాజగోపాల్‌రెడ్డి.. సీఎల్పీలో మాత్రం కొనసాగుతున్నారు. కాగా, పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి.. ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి తాజా వ్యాఖ్యలు కొత్త తలనొప్పి తెచ్చాయని అంటున్నారు. వెంకట్‌రెడ్డి ప్రయత్నాలపై ఇవి ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం పార్టీ కేడర్ అంతా నాగార్జున సాగర్ పై దృష్టి పెట్టిన తరుణంలో రాజగోపాల్ రెడ్డి తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందని కొందరు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.