iDreamPost
iDreamPost
ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశాలు ఇస్తారో అంతు చిక్కడం లేదు. అసలు ఫామ్ లేక దర్శకత్వానికి దాదాపు దూరమైన మెహర్ రమేష్ కి ఓకే చెప్పారు. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం తెలుగులో సినిమా చేసి పూర్తిగా తమిళంలో సెటిలైన మోహన్ రాజాని పిలిచి మరీ లూసిఫర్ రీమేక్ పనులు అప్పగించారు. గట్టిగా బ్లాక్ బస్టర్ అని చెప్పుకునే సినిమా లేని బాబీకి మైత్రి వాళ్ళ కోసం కమిట్ అయ్యారు. ఒక్క ఆచార్యకు మాత్రమే ఫామ్ లో ఉన్న కొరటాల శివ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ అయ్యాక ఎవరితో చేస్తారనే సందేహం రావడం సహజమే కదా. దానికో సమాధానం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
తాజా అప్ డేట్ ప్రకారం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చిరు కోసం ఓ కథను సిద్ధం చేశారట. గతంలో బాలకృష్ణతో చేయాలనుకుని ఆపేసిన ఓ సబ్జెక్టునే మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్టు మార్చి త్వరలోనే వినిపించబోతున్నట్టు వినికిడి. ఇందులో ఓ పాత్రలో అప్పట్లో అమితాబ్ బచ్చన్ ను సంప్రదిస్తే ఆయన నో చెప్పారు. అందుకే అది ఆగిపోయిందనే టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు మరోసారి దాన్ని బయటికి తీసి బూజు దులపబోతున్నారన్న మాట. అయితే ఇది అధికారికంగా ప్రకటన వచ్చే దాకా నిజమని చెప్పలేం కానీ ఫిలిం నగర్ టాక్ అయితే జోరుగా ఉంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు వచ్చేలా చూస్తున్నారట చిరు.
ఇక కృష్ణవంశీ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో చేస్తున్న మరాఠి నట సామ్రాట్ రీమేక్ రంగమార్తాండ ఎక్కడి దాకా వచ్చిందో అంతు చిక్కడం లేదు. ఇటీవలే ఇళయరాజా అధర్వంలో తిరిగి మ్యూజిక్ సిటింగ్స్ మొదలయ్యాయి. కానీ షూటింగ్ తాలూకు అప్ డేట్స్ మాత్రం లేవు. రమ్యకృష్ణ, అనసూయ, బ్రహ్మానందం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న రంగమార్తాండ ఎప్పుడు విడుదలవుతుందో కూడా అంతుచిక్కడం లేదు. మరోవైపు గతంలో ఇచ్చిన మెగా ఆఫర్ గోవిందుడు అందరివాడేలే రూపంలో వృథా చేసుకున్న కృష్ణవంశీని నిజంగా మెగా ఛాన్స్ తలుపు తట్టిందో లేదో చూడాలి