iDreamPost
android-app
ios-app

ఆరోగ్య శాఖ అచ్చిరాలేదు..

  • Published May 02, 2021 | 3:36 AM Updated Updated May 02, 2021 | 3:36 AM
ఆరోగ్య శాఖ అచ్చిరాలేదు..

తెలంగాణలో ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్. రాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కడ చూసినా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖను ఈటల రాజేందర్ నుంచి తీసేసుకున్న సీఎం కేసీఆర్.. త్వరలోనే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని వార్తలు బయటికి వస్తున్నాయి. ఇందుకు రంగం సిద్ధమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి తెలంగాణలో నేతలకు మొదటి నుంచీ వైద్య ఆరోగ్య శాఖ అచ్చిరాలేదు. ఎందుకంటే ఈ ఎనిమిదేళ్లలో ముగ్గురు మంత్రులు మారారు. ఏ ఒక్కరూ ఐదేళ్లపాటు కొనసాగలేదు. పైగా ఇందులో ఇద్దరినీ సీఎం కేసీఆర్ పదవి నుంచి తొలగించడం గమనార్హం.

ముందు రాజయ్య..

డాక్టర్ టి.రాజయ్య.. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, తొలి ఆరోగ్య శాఖ మంత్రి కూడా. కానీ సరిగ్గా ఆరు నెలలు కూడా ఆయన మంత్రి పదవిలో ఉండలేదు. అవినీతి ఆరోపణలతో రాజయ్యను సీఎం కేసీఆర్ తొలగించారు. స్వైన్ ఫ్లూ వ్యాప్తి, వరంగల్ కు హెల్త్ యూనివర్సిటీపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మంత్రి పదవి పోవడానికి కారణమయ్యాయి.

ఓ సందర్భంలో స్వైన్ ఫ్లూ వల్ల ఐదుగురు చనిపోయారని తొలుత చెప్పిన రాజయ్య.. తర్వాత మాత్రం అసలు ఎవరూ చనిపోలేదని అన్నారు. ఆస్పత్రుల్లో పేషెంట్ల దగ్గర సిబ్బంది రూ.100, 200 తీసుకుంటే తప్పులేదని చెప్పి విమర్శల పాలయ్యారు. అంతకుముందు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వరంగల్ కు ఆరోగ్యవిశ్వ విద్యాలయం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తన అనుమతి లేకుండా హామీ ఇవ్వడంపై సీరియస్ అయిన కేసీఆర్.. ‘ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు’ అని అన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కారణాలతో మంత్రి పదవి నుంచి రాజయ్య ఉద్వాసనకు గురయ్యారు.

2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాజయ్య.. అప్పటి టీడీపీ అభ్యర్థి కడియం శ్రీహరిపై గెలిచారు. 2011లో టీఆర్ఎస్ లో చేరారు. తర్వాత తన రాజకీయ ప్రత్యర్థి అయిన శ్రీహరి కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. 2014లో వరంగల్ ఎంపీగా గెలిచిన శ్రీహరి.. తర్వాత కేసీఆర్ సూచన మేరకు ఉప ముఖ్యమంత్రిగా, విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా రాజయ్యను దించి.. శ్రీహరిని ఎక్కించారు కేసీఆర్.

లక్ష్మారెడ్డికి మళ్లీ చాన్స్ దక్కలేదు..

సి.లక్ష్మారెడ్డి కూడా డాక్టరే.. తెలంగాణ వచ్చాక ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజయ్యను తొలగించడంతో ఆయన స్థానంలో ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. 2018లో అసెంబ్లీ రద్దయ్యేదాకా ఆయన తన పదవిలో కొనసాగారు. కానీ మళ్లీ గెలిచాక మాత్రం ఆయన్ను కేసీఆర్ దూరం పెట్టారు. కేబినెట్ లో లక్ష్మారెడ్డికి చోటు దక్కలేదు.

2001లో టీఆర్ఎస్ ఏర్పాటయ్యాక పార్టీలో చేరారు లక్ష్మారెడ్డి. 2004లో జరిగిన ఎన్నికల్లో జడ్చర్ల నుంచి గెలిచారు. 2008లో కేసీఆర్ పిలుపు మేరకు తన పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేశారు. కానీ ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో మహాకూటమితో కలసి టీఆర్ఎస్ పోటీ చేయడంతో పొత్తులో భాగంగా జడ్చర్ల సీటు భాగస్వామ్య పార్టీలకు పోయింది. అయినా నిరుత్సాహపడని లక్ష్మారెడ్డి… మహబూబ్ నగర్ ఎంపీగా బరిలో నిలిచిన కేసీఆర్ ను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు.

ఈటల కూడా మధ్యలోనే..

తెలంగాణలో తొలి కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పని చేశారు ఈటల రాజేందర్. రెండో సారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ కొన్ని నెలలుగా అసమ్మతి స్వరం పెంచుతుండటంతో ఆయనపై వేటు వేశారు సీఎం కేసీఆర్. వైద్య ఆరోగ్య శాఖను ఈటల నుంచి తీసేసుకున్నారు. ప్రస్తుతానికి ఏ పోర్టుఫోలియో లేకుండానే మంత్రిగా ఉన్నారు ఈటల రాజేందర్.

టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు ఈటల. గతంలో ఈటల తన కుడిభుజం అని పలుమార్లు కేసీఆర్ ప్రకటించారు. 2004 నుంచి ఎమ్మెల్యేగా ఈటల కొనసాగుతున్నారు. ఉమ్మడి ఏపీలో టీఆర్ఎస్ఎల్పీ నేతగా కొనసాగారు.

ఈటల రాజేందర్, రాజయ్య ఇద్దరు కూడా ‘వైరస్’లు ఉన్న సమయంలోనే తమ పదవులను కోల్పోయారు. రాజయ్య మంత్రిగా ఉన్న సమయంలో స్వైన్ ఫ్లూ ఉండగా.. ఇప్పుడు కరోనా ఉంది.

కొత్త మంత్రి ఎవరు?

ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. మంత్రిత్వ శాఖను ఈటల నుంచి కేసీఆర్ కు బదిలీ చేస్తూ శనివారం గవర్నర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టే మంత్రి ఎవరు అనే ప్రశ్న మొదలైంది. మరోసారి వైద్యారోగ్య శాఖ మంత్రిగా సి.లక్ష్మారెడ్డిని నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే బీసీ కులానికి చెందిన ఈటలను తీసేసిన నేపథ్యంలో బీసీ లీడర్ నే మంత్రిని చేస్తారని పార్టీ నేతలు అనుకుంటున్నారు. గతంలో రాజయ్య ఎపిసోడ్ ను ఉదాహరణగా చెబుతున్నారు.