iDreamPost
android-app
ios-app

Mayawati – మాయావతి… ఎగిసిపడిన కెరటం

  • Published Nov 23, 2021 | 4:14 AM Updated Updated Mar 11, 2022 | 10:34 PM
Mayawati – మాయావతి… ఎగిసిపడిన కెరటం

‘ప్రజాస్వామ్య అద్భుతం’… ఉత్తరప్రదేశ్‌ తొలి దళిత ముఖ్యమంత్రిగా మాయావతి ఎన్నికైన సందర్భంలో మాజీ ప్రధానమంత్రి దివంగత పి.వి.నరసింహారావు అన్నమాట. అతి సామాన్యమైన నేపథ్యం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా మాయావతి ఎన్నిక కావడం ద్వారా ఆమె దేశం దృష్టిని ఆకర్షించారు. దేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రిగా సంచలనం సృష్టించడమే కాదు.. దళిత, గిరిజన, ముస్లిం మైనార్టీల్లో కొత్త ఆశలను రేకెత్తించారు. లక్షలాది మంది దళితులకు ఆమె ఒక ఐకాన్‌గా నిలిచారు.

కాన్షీరాం శిష్యురాలైన మాయావతిని ఆయా వర్గాల వారు బెహన్‌ జీ (సోదరి)గా పిలుచుకుంటారు. బహుజన సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) పగ్గాలు చేపట్టి జాతీయస్థాయిలో పార్టీని బలోపేతం చేశారు. పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించారు. గణనీయంగా పార్లమెంట్‌, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు సాధించడం ద్వారా సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో ఆమె పేరు భవిష్యత్‌ దేశ ప్రధానిగా వినిపించింది. జయలలిత, మమతా బెనర్జీల వలే ధిక్కార ధోరణి.. ప్రత్యర్థులు ఎంత శక్తివంతులైనా ఢీ కొట్టే గుణం, పట్టువీడని పోరాటం వంటి లక్షణాలతో మాయావతి దేశ రాజకీయాల్లో తనకుంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. అంతటి శక్తివంతమైన మాయావతి, మైనార్టీ కుల, మతాలకు ప్రతినిధిగా చెప్పుకునే బీస్పీలు ఇప్పుడు సొంత రాష్ట్రం యూపీలో ఉనికి కోసం పాట్లు పడాల్సి రావడం కాలమహిమ.

ఉత్తరప్రదేశ్‌కు మాయావతి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తొలిసారి ఆమె ఎస్పీ మద్దతుతో 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. జూన్‌లో ముఖ్యమంత్రి అయిన ఆమె అక్టోబరు వరకు కేవలం నాలుగు నెలలు మాత్రమే పనిచేశారు. ఎస్పీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. రెండవసారి 1997 మార్చిలో బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం కావడం, సెప్టెంబరులో కేవలం ఆరు నెలల్లో తిరిగి అధికారం కోల్పోవడం జరిగింది. 2002 నుంచి 2003 వరకు బీజేపీ మద్దతుతో మూడవసారి సీఎం కావడం ఏడాది కాలంలోనే వైదొలగడం జరిగింది.

ఇక నాల్గవసారి 2007లో ఆమె ముఖ్యమంత్రి కావడం, బీఎస్పీ యూపీలో సంపూర్ణ మెజార్టీ సాధించడం ఒక అద్భుతం. దళిత, మైనార్టీలకు మద్దతుగా ఉంటూ… అగ్రవర్ణాల మీద ఒంటికాలి మీద లేచే మాయావతి ఆ ఎన్నికల్లో బ్రహ్మణ, ఠాగూర్‌ వంటి అగ్రకులాలను దగ్గర చేసుకుంది. వారికి అధిక సంఖ్యలో సీట్లు కేటాయించడం ద్వారా సంచలన విజయం సాధించారు. యూపీలో ఆమె 206 స్థానాలు సాధించి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. పూర్తి మెజార్టీ వచ్చిన సందర్భంలోనే ఆమె ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అగ్రవర్ణాలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని భావించారు కాని ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు.

మాయవతి ఒక్కరే కాదు… ఆమె అధ్యక్షురాలిగా ఉన్న బీఎస్పీ పార్టీది సైతం ఎగిసిపడిన కెరటమే. ఆ పార్టీ పార్లమెంట్‌లో ఎన్నికల్లో గణనీయమైన విజయాలు సాధించింది. 1989 ఎన్నికల్లో 4 స్థానాలతో మొదలైన ప్రస్థానం, ఆ తరువాత 1991లో మూడు, 1996లో 11, 1998లో ఐదు, 1999లో 14, 2004లో 19, 2009లో 21 ఎంపీలు గెలిచిన ఆ పార్టీ 2014లో ఒక్క సీటుకే పరిమితమైంది. తిరిగి 2019లో పది స్థానాలు కైవసం చేసుకుంది.

ఇక ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాలకు వస్తే ఆ పార్టీ 1993, 96లలో జరిగిన ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్న 67 స్థానాల చొప్పున గెలుచుకుంది. 2002లో విడిగా పోటీ చేసి 98 స్థానాలు, 2007లో 206, 2012లో 80, 2017 నాటికి 19 స్థానాలు పొందింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ సీట్లు, ఓట్లు సాధించి తన ఉనికి చాటుకుంది. మధ్యప్రదేశ్‌లో ప్రతీ ఎన్నికల్లో ఆ పార్టీకి రెండు,మూడు సీట్లు వస్తున్నాయి. 1998లో 11 స్థానాలు సాధించింది. రాజస్థాన్‌, బీహార్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఢిల్లీ, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాజ్‌ రాష్ట్రాలలో జరిగిన వివిధ ఎన్నికల్లో ఆ పార్టీ సీట్లు సాధించింది. చివరకు జమ్మూ అండ్‌ కాశ్మీర్‌లో సైతం 1996 ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచింది. మిగిలిన రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఓటు బ్యాంకు ఉంది.

ఇంతటి ఘనత ఉన్న ఆ పార్టీ త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో తన ఉనికిని చాటుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. ఈసారి ఎన్నికల్లో ఓటమి చెందితే బీఎస్పీ ఇక కోలుకునే అవకాశం లేదు. మాయావతికి మరోసారి యూపీలో అధికార పీఠం పొందే పరిస్థితి లేకుండా పోతుంది. ఎందుకంటే ఆమెకు ఇప్పటికే 65 ఏళ్లు. మాయావతి రాజకీయాల నుంచి తప్పుకుంటే బీఎస్పీ పగ్గాలు చేపట్టి పార్టీకి పూర్వవైభవం తెచ్చేవారు ఆ పార్టీలో కనుచూపుమేర ఎవరూ లేరు. ఎందుకంటే మాయావతే బీఎస్పీ, బీఎస్పీ అంటే మాయవతిగా ఉంది.

త్వరలో జరిగే ఎన్నికల్లో సైతం ఆ పార్టీ విజయంపై కార్యకర్తలలో పెద్ద నమ్మకం లేదు. ఇటీవల విడుదలైన ఎబీపీ ` సీ ఓటరు సర్వే ప్రకారం ఆ పార్టీకి కేవలం 16 నుంచి 20 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా, ఓటింగ్‌ శాతం కూడా 15.1 మించదని సర్వేలో తేలింది. 2007 ఎన్నికల్లో ఏకంగా 30.43 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ గత ఎన్నికల్లో 22.24 శాతం ఓట్లకు పరిమితమైంది. అటువంటిది ఇప్పుడు ఓటింగ్‌ మరింత తగ్గడానికి మాయావతి స్వయంకృతమనే విమర్శలున్నాయి.

2007లో యూపీ ఎన్నికల్లో సాధించిన సంచలన విజయం బీఎస్పీకి ,మాయావతికి బలమే కాదు.. భారం కూడా అయ్యింది. అధికారంలో ఉండగా మాయవతిపై లెక్కకుమిక్కిలి ఆరోపణలు వచ్చాయి. 2007లో భూకబ్జాకు పాల్పడిన సొంత పార్టీ ఎంపీ ఉమాకాంత్‌ యాదవ్‌ను అరెస్టు చేయించడం ద్వారా ప్రశంసలు అందుకున్న ఆమె తరువాత అవినీతి ఆరోపణలు నిండా కూరుకుపోయారు. శాంతి భద్రతలు కాపాడడం, మాఫియాను కట్టడి చేయడంలో భేష్‌ అనిపించుకున్నారు. అయితే తాజ్‌ కారిడార్‌ విషయంలోను, విగ్రహాల ఏర్పాటు వంటి విషయాల్లో మాయావతిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఆమె బహిరంగంగా పార్టీ కార్యకర్తలు కోట్ల రూపాయలలో తయారు చేసిన నోట్లు దండలు ధరించడం అప్పట్లో పెనుదుమారాన్ని రేకెత్తించింది. బ్రతికి ఉండగానే తన విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం, పార్టీకి చెందిన ఏనుగు బొమ్మల ఏర్పాటు వివాదాస్పదమయ్యాయి. ఇవన్నీ సామాన్య ప్రజలను, మరీ ముఖ్యంగా ఆమెకు అండగా నిలిచిన దళిత, గిరిజన, మైనార్టీ ఓటర్లకు దూరం చేశాయి. ఒకప్పుడు యూపీలో మాయావతి అభిమానులు తరచూ ఒక మాట అనేవారు. ‘బెహన్‌ జీ తుమ్‌ సంఘర్ష్‌ కరో… హమ్‌ తుమారే సాథ్‌ హైం (సోదరీ మీరు పోరాటం చేయండి.. మేము మీతో ఉన్నాము). ఇప్పుడు మాయా అభిమానులు, బీఎస్పీ కార్యకర్తలు పొరపాటును కూడా ఉచ్చరించడం లేదు.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet