Idream media
Idream media
భారతదేశ రాజకీయాల్లో ఆమె ఒక సంచలనం. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అలాంటి మహిళా నేత.. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలకు మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఆమె ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతి.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చివరిదశకు వచ్చాయి. మొత్తం ఏడు దశల ఎన్నికలకుగాను మార్చి 3వ తేదీతో ఆరుదశల పోలింగ్ పూర్తయింది. ఈ నెల 7వ తేదీన చివరిదైన ఏడోదశ పోలింగ్ జరగబోతోంది. అయితే ఆరుదశల్లోనూ మాయావతి ఎన్నికల ప్రచారం చేయలేదు. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీలు వివిధ రూపాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తుంటే.. మాయావతి మాత్రం ఎన్నికలే జరగడంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇదేమి తీరు అని అడిగినవారికి.. తాము ప్రత్యేకం అంటూ సమాధానం ఇస్తున్నారు మాయావతి. అన్ని పార్టీల మాదిరిగా తాము బహిరంగసభలు, ఇంటింటి ప్రచారం నిర్వహించబోమని చెబుతున్నారు మాయావతి. తమకు ప్రచారం ఎలా నిర్వహించాలో కాన్సీరాం నేర్పించారని, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఈ సమాధానం విన్న వారు నోరెళ్లబెడుతున్నారు. ఓటర్ల వద్దకు వెళ్లి ఓటు అడగకపోతే ఓట్లు ఎలా వేస్తారు..? అయ్యా, అమ్మా అంటూ ఒకటికి నాలుగుసార్లు తిరిగితేనే ఓటర్లు దయచూపే అవకాశం ఉంది. ఇన్ని సార్లు తిరిగారు, అడిగారు అనే సానుభూతి ఉంటుంది. అసలు మేము ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడగం, ఇంటింటికి తిరిగి ఓటు వేయండని ప్రచారం చేయబోమంటే మాయావతి పార్టీకి ఓట్లు ఎలా వస్తాయో ఆమే చెప్పాలి.
కారణాలు ఏమైనా మాయావతి ఈ ఎన్నికలను లైట్ తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తున్నా.. మాయావతి మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. కానీ 403 స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెట్టారు. కానీ ఎన్నికల ప్రచారం మాత్రం చేయడంలేదు. ఈ తరహా తీరును కనబరుస్తున్న మాయావతి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఎస్పీ ఓటు బ్యాంకును చీల్చేందుకు, బీజేపీ ఓటు బ్యాంకు పక్కకు పోకుండా ఉండేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో మాయావతిపైన, ఆమె పార్టీపైన బీజేపీ నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో.. మాయావతి వ్యూహం ఏమిటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. కానీ ఈ ఎన్నికల్లో బీఎస్పీ గెలుస్తుంది, అధికారం చేపడతామనే ప్రకటనలు మాయావతి చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు జరిగిన సర్వేల్లో బీఎస్పీకి 15–20 సీట్లు వస్తాయనే అంచనాలు వెలువడ్డాయి. ఎంత పోరాడినా అధికారం దక్కదనే భావనకు మాయావతి వచ్చినట్లున్నారు. అందుకే బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఏ పార్టీ అయినా స్వల్ప మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, లేదంటే హంగ్ కూడా రావొచ్చని సర్వేలు చెప్పాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ కనీసం 20–30 సీట్లు గెలిచినా.. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. బీజేపీకి మద్ధతు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో తన పార్టీ నేతలకు పదవులు దక్కడంతోపాటు.. మాయావతికి కేంద్రంలో సముచిత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. మరి మాయావతి మైండ్‌లో ఏముందో గానీ.. అందరి భవిష్యత్ ఈ నెల 10వ తేదీన తేలిపోతుంది.