iDreamPost
iDreamPost
ఏదైనా సినిమాకు బ్రహ్మరధం పట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేలా చేయడంలో మాస్ ప్రేక్షకులదే సింహభాగం అనుకుంటాం కానీ దానికి భిన్నంగా కొన్ని చిత్రాలు కేవలం సెంటిమెంట్ తో వసూళ్ల సునామి సృష్టించడం చాలా అరుదు. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా 1993లో వచ్చిన మాతృదేవోభవ. సీనియర్ నటి మాధవి టైటిల్ రోల్ లో నాజర్, తనికెళ్ళ భరణి, కోట, అల్లు రామలింగయ్య తదితరులు కీలక పాత్రల్లో అజయ్ కుమార్ దర్శకత్వంలో కెఎస్ రామారావు దీన్ని నిర్మించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆకాశదూతుకి ఇది అఫీషియల్ రీమేక్. అంగరక్షకుడు షూటింగ్ టైంలో ఈ సినిమా చూసిన రామారావు గారు తెలుగు ఆడియన్స్ కి కూడా ఇది బ్రహ్మాండంగా నచ్చుతుందని ఫిక్సయిపోయి ఆలస్యం చేయకుండా హక్కులు కొనేశారు.
రచయిత సత్యమూర్తి(దేవిశ్రీ ప్రసాద్ తండ్రి)తో వెంటనే స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. ఒరిజినల్ వెర్షన్ లో చేసిన మాధవి కన్నా బెటర్ ఛాయస్ ఇంకెవరు కనిపించలేదు యూనిట్ కి. హైదరాబాద్ పరిసరాల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. కీరవాణి అద్భుత సంగీతంలో వేటూరి సాహిత్యం ప్రాణం పోసుకుంది. అక్టోబర్ 22న ఎలాంటి అంచనాలు లేకుండా మాతృదేవోభవ థియేటర్లలో విడుదలైంది. మొదటి మూడు నాలుగు రోజులు పెద్దగా జనం లేరు. హాళ్ల యజమానులు నుంచి కేఎస్ రామారావు గారికి ఫోన్లు. రెండో వారం తర్వాత కొనసాగించడం కష్టమని తేల్చేశారు. హైదరాబాద్ థియేటర్లలో జనం చాలా పల్చగా ఉన్నారు.
మంచి సినిమాను ఎలాగైనా నిలబెట్టాలనే సంకల్పంతో ఇంకొద్ది రోజులు కొనసాగించమని డెఫిసిట్ ని తాను భరించే హామీ మీద డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించారు.
తనకు పట్టున్న మార్కెటింగ్ నైపుణ్యానికి పదును పెట్టారు. సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు కర్చీఫ్ లు ఉచితంగా ఇస్తామని పబ్లిసిటీ చేశారు. విని నవ్వుకున్న పబ్లిక్ అంత ఏడిపిస్తారా ఏదీ చూద్దాం అంటూ రావడం మొదలుపెట్టారు. ఊహించని విధంగా ఆ కర్చీఫ్ లు తడిసిముద్దయ్యే స్థాయిలో గుక్కతిప్పుకోకుండా మహిళలు కన్నీళ్లు పెడుతూ మాతృదేవోభవని దీవించడం మొదలుపెట్టారు. ఓ తాగుబోతు తండ్రి ఆ వ్యసనం వల్లే ప్రాణాలు కోల్పోతే చిన్నపిల్లలతో దిక్కు లేని స్థితిలో తాను కూడా చనిపోయే జబ్బుతో ఉన్న మాతృమూర్తి మనసును చంపుకుని వాళ్ళను దత్తకు ఇవ్వడమనే ఉదాత్తమైన కథాంశానికి ఆడామగా తేడా లేకుండా కదిలిపోయారు.
నెల రోజులు ఆడితే గొప్ప అనుకుంటే ఏకంగా 50, 100 అనుకుంటూ మాతృదేవోభవ జైత్రయాత్ర కొనసాగింది. నిజానికి ఈ స్థాయిలో హృదయాలు కదిలేలా కన్నీళ్లు పెట్టించిన సినిమా ఇంకేదీ లేదని ఇప్పటికీ ఎందరో అభిమానుల నిశ్చితాభిప్రాయం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాట జాతీయ అవార్డు గెలుచుకుంది. 5 కోట్ల దాకా వసూళ్లు రావడం చూసి అందరూ షాక్ తిన్నారు . ఏకంగా పది కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది మాతృదేవోభవ. చాలా నంది అవార్డులు వరించాయి. వంద రోజుల వేడుకలో ఇలాంటి సినిమా పితృదేవోభవ పేరుతో ఎవరైనా తీస్తే తాను సిద్ధమంటూ శోభన్ బాబు ప్రకటించడం దీని ఘనతకు మరో మచ్చుతునక.