ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కనబడటం లేదని రాజధాని రైతులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి విదితమే. కాగా నియోజకవర్గంలో కనబడటం లేదన్న వ్యాఖ్యలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని తన అన్న కుమారుడి పెళ్ళికి వెళ్లానని స్పష్టం చేసారు. నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడూ అందుబాటులోనే ఉంటానని చెప్పుకొచ్చారు. కుప్పం నియోజకవర్గానికి గత 40 ఏళ్లుగా చంద్రబాబు వెళ్లడం లేదని, ముందుగా కుప్పం నియోజక వర్గ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆళ్ల రామకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు.
కొన్ని రోజుల ముందు ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన 3 రాజధానుల ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా అమరావతి ప్రాంత రైతులు రాజధానిపై ఏర్పడిన సందిగ్ధత గురించి తమ గోడు చెప్పుకోవడానికి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డిని కలవడానికి ప్రయత్నం చేయగా అయన నివాసంలో కానీ, కార్యాలయంలో కానీ నియోజకవర్గంలో కానీ కనబడటం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.
రైతుల ఫిర్యాదు నేపథ్యంలో స్పందించిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజధాని రైతులకు అన్యాయం జరగదని స్పష్టం చేసారు. కానీ తాను కనిపించడం లేదంటూ రైతులు చేసిన ఫిర్యాదుపై తరువాత స్పందిస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.