Maja Ma మజా మా రిపోర్ట్

90 దశకంలో యువకులుగా సినిమాలు చూసినవాళ్లకు మాధురి దీక్షిత్ అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన హం ఆప్కే హై కౌన్ లాంటి వాటిలో తనను చూసినవాళ్లు అంత సులభంగా మర్చిపోలేరు. తేజాబ్, ఖల్ నాయక్, సాజన్, దిల్, దిల్ తో పాగల్ హై,దేవదాస్ లాంటి ఎన్నో క్లాసిక్స్ తన కీర్తి మకుటంలో ఉన్నాయి. పెళ్లి చేసుకున్నాక తెరకు దూరమైన మాధురి దీక్షిత్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 2007లో ఆజా నాచ్లేతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అది ఆశించినంత గొప్ప ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. తిరిగి విరామం తీసుకున్న ఈ డ్రీం క్వీన్ తిరిగి ఈ ఏడాదే బాలీవుడ్ పునఃప్రవేశం చేశారు.

ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ది ఫేమ్ గేమ్ లో ప్రధాన భూమిక పోషించిన మాధురికి అది మంచి పేరే తీసుకొచ్చింది. తాజాగా మజా మా అనే మరో సినిమా ద్వారా ప్రైమ్ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ తో తన అభిమానులను పలకరించారు. యుఎస్ లో ఉండే తేజస్ పటేల్(రిత్విక్ భౌమిక్) తొలి చూపులోనే ఈషా(బర్ధ సింగ్)ను ప్రేమిస్తాడు. వీళ్ళ లవ్ ని అర్థం చేసుకున్న ఈషా తల్లితండ్రులు తేజస్ అమ్మ పల్లవి(మాధురి దీక్షిత్), తండ్రి మనోహర్(గజరాజ్ రావు)లతో సంబంధం మాట్లాడేందుకు వస్తారు.అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటే ఊహించని ఓ స్పీడ్ బ్రేక్ వచ్చి పడుతుంది. అసలు కొడుకు ప్రేమ విషయంలో పల్లవి ఎదురుకున్న సమస్య ఏంటి, ఎలా ఈ గండాన్ని పరిష్కరించిందనేదే కథ.

ఇంటరెస్టింగ్ పాయింట్ ని తీసుకున్న దర్శకుడు ఆనంద్ తివారి అంతే ఆసక్తికరంగా పూర్తి సినిమాని నడిపించలేకపోయారు. రెండుంపావు గంటల నిడివిలో సెకండ్ హాఫ్ మొత్తం విపరీతమైన సాగతీత, పసలేని సీన్లతో విసిగించేశాడు. మెయిన్ కాంఫ్లిక్ట్ సైతం అందరు ఆడియన్స్ కి ఆమోదయోగ్యంగా లేకపోవడం మరో ప్రధాన మైనస్. మాధురి తన ఎనర్జీ, యాక్టింగ్, డాన్సులతో మెప్పించినప్పటికీ ఓవరాల్ గా చూస్తే ఆవిడ స్థాయిలో ఊహించుకున్నంత మ్యాటర్ అయితే ఇందులో లేదు. యాభై అయిదేళ్ల వయసులో ఆ చలాకీధనాన్ని మెచ్చుకోవలసిందే. మాధురి వీరాభిమానులకే ఓ సోసోగా పర్వాలేదనిపించే నచ్చే మజామాలో ఎలాంటి మజా లేదు

Show comments