iDreamPost
iDreamPost
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా అంటే ముక్కుసూటిగా మాట్లాడి మూడు చెరువుల నీళ్ళు తాగించేస్తుందనే పేరుంది. కానీ ఇప్పుడావిడే నీళ్ళు నమలాల్సిన పరిస్థితి. కారణం ఆమె వాడే హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్ ఏం చేసింది అంటారా? అది అలాంటిలాంటి బ్యాగ్ కాదు. లూయీ విట్టన్ బ్రాండ్. ఖరీదు లక్షన్నర పైమాటే! ఈ బ్యాగే మహువా మోయిత్రాని చిక్కుల్లోకి నెట్టింది.
సోమవారం లోక్ సభలో ధరల పెరుగుదలపై వాడివేడి చర్చ జరుగుతోంది. విపక్షాల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఈ చర్చకు అంగీకరించింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తీదార్ ద్రవ్యోల్బణంపై సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఆమె పక్కనే కూర్చుని ఉన్న మహువా మోయిత్రా తన బ్యాగ్ తీసి ఎవరికీ కనపడకుండా కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. సామాన్య మానవుడి నడ్డి విరుస్తున్న ధరల పెరుగుదలపై చర్చ జరుగుతుండగా మహువా మోయిత్రా ఇంత ఖరీదైన బ్రాండెడ్ బ్యాగ్ వాడుతారా అని నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేశారు. సరే ఖరీదైన బ్యాగ్ ఉంటే ఉండనీ ధరలపై చర్చ మొదలవ్వగానే దాన్ని తీసి దాయడమెందుకు? ఎంపీ హిపోక్రసీకి ఇది అద్దం పడుతుందని ఒక యూజర్ మండిపడ్డారు. అయితే నటి, సామాజిక కార్యకర్త స్వర భాస్కర్ మహువా మోయిత్రాకి అండగా నిలిచింది. ఈ వీడియోలో ఎంపీ తన బ్యాగ్ దాచుకున్నట్లుగా ఏమీ లేదని వెనకేసుకొచ్చింది. మోయిత్రాది గొప్ప కార్పొరేట్ కెరీర్ అని ఆమె గుర్తు చేసింది. కష్టపడి సంపాదించిన డబ్బుతో బ్రాండెడ్ ఐటమ్స్ కొంటే ఇంత హంగామా అవసరమా అని స్వర భాస్కర్ తన ట్వీట్ లో విరుచుకుపడింది. ఈ వివాదంపై మహువా మోయిత్రా తనదైన స్టైల్ లో స్పందించారు. 2019 లో పార్లమెంటులోకి జోలెతో వచ్చిన ఫకీర్ ని నేను. అదే జోలెతో తిరిగి వెళ్తాను అని చమత్కారంగా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని టార్గెట్ చేశారు.
Jholewala fakir in Parliament since 2019.
Jhola leke aye the… jhola leke chal padenge… pic.twitter.com/2YOWst8j98
— Mahua Moitra (@MahuaMoitra) August 2, 2022