iDreamPost
iDreamPost
ఇది మా ప్రశ్న కాదు. చాలా మంది అభిమానుల మదిలో మెదులుతున్నది. తన స్టార్ డంతో సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న మహేష్ బాబు ఇప్పుడు ఓ ఛానల్ తరఫున మూడు సీరియల్స్ కు సంబంధించి ప్రమోషనల్ యాడ్ లో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలుగునాట సీరియల్స్ కు విపరీతమైన ఆదరణ ఉన్న మాట వాస్తవం. అందుకే రేటింగ్స్ లోనూ ఇవి టాప్ ప్లేస్ ని ఆక్రమించుకుంటూ ఉంటాయి.
అయితే మితిమీరిన మెలోడ్రామాతో ఆడాళ్ళను విలన్లుగా చూపించడం వేల కొద్ది ఎపిసోడ్లతో వీటిని సాగదీసే ఉద్దేశంతో అర్థం పర్థం లేని ప్రహసనాలు ఇందులో చూపిస్తారననే కామెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. లేడీస్ అండ ఉంది కాబట్టి ఇవి అన్ని ఛానల్స్ లోనూ దిగ్విజయంగా గడిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి మహేష్ ఎండార్స్ చేయడం ఏమిటా అనే సందేహం తలెత్తక మానదు. నిజానికి ఈ సీరియల్స్ మహేష్ చూసే అవకాశం ఉండకపోవచ్చు
తాను ఎలాగైతే వస్తువులకు బ్రాండ్ లకు సెలబ్రిటీగా ఉన్నానో అదే తరహాలో సీరియల్స్ ను ప్రమోట్ చేస్తే తప్పేంటి అనే ఆలోచన మహేష్ కు ఉండి ఉండవచ్చు. దానికి తోడు సదరు ఛానల్ నుంచి ఆకర్షణీయమైన రెమ్యునరేషన్ ఉండే ఉంటుంది. ఎలాగూ మహేష్ అంతటి వాడే చెప్పాడు అంటే వాటిలో చాలా విషయం ఉంటుందని భావించే వాళ్ళు లక్షలు కోట్లలో ఉంటారు. అంతదాకా ఎందుకు తమ హీరో చెప్పాడు కాబట్టి అనే కారణంతో అభిమానులే చూసినా చూడొచ్చు. సో రెండు రకాల లాభాలు ఆశించే సదరు ఛానల్ ఇలా మహేష్ ని రంగంలోకి దించిందన్న మాట. సినిమా ప్రొడ్యూసర్లను మించిన స్ట్రాటజీలతో ఛానెళ్లు కొత్త పోకడలు పోతున్నాయి.