iDreamPost
android-app
ios-app

మ‌హారాష్ట్రలో మొద‌లైన రాజ‌కీయ కాక‌

మ‌హారాష్ట్రలో మొద‌లైన రాజ‌కీయ కాక‌

మొన్న‌టి వ‌ర‌కూ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ లో కొన‌సాగుతున్న రాజ‌కీయ వేడి తాజాగా మహారాష్ట్రలోనూ మొద‌లైంది. త‌మ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని, ఎలా కూలుస్తారో చూస్తాన‌ని మ‌హారాష్ట్ర ‌ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బీజేపీకి సవాల్‌ విసిరారు. తమ ప్రభుత్వ భవితవ్యం విపక్షం చేతిలో లేదని అన్నారు. ఒకట్రెండు నెలల్లో తన ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్నారని, వారిని తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుతున్నానని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం ఆటో రిక్షా మాదిరిగా మూడు చక్రాలతో సాగుతోందని, పేద ప్రజల కోసం స్టీరింగ్‌ తన చేతిలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మరో ఇద్దరు (కాంగ్రెస్‌, ఎన్సీపీ) వెనుకనుంచి తమకు మద్దతుగా కూర్చున్నారని అన్నారు. మరి కేంద్రంలో ఎన్డీయే పరిస్థితి ఏంటి? వారికి ఎన్ని చక్రాలున్నాయని ప్రశ్నించారు. గతంలో తాను ఎన్డీయే సమావేశానికి హాజరైనప్పుడు వారికి రైలు తరహాలో 30-35 చక్రాలున్నాయ’ని (పార్టీలు) ఠాక్రే ఎద్దేవా చేశారు. ఇక చైనాతో సరిహద్దు వివాదాన్ని ఠాక్రే ప్రస్తావిస్తూ ఈ అంశంపై దేశానికి ఓ విధానాన్ని నిర్ణయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించానిని అన్నారు. 20 మంది అమర జవాన్ల త్యాగానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ఠాక్రే వ్యాఖ్యానించారు. కానీ మనం చైనా యాప్‌లను నిషేధించి సంబరపడ్డామని మోదీ సర్కార్‌కు చురకలు వేశారు.

పూజ‌లో పాల్గొంటా

అయోధ్యలో ఆగస్ట్‌ 5న రామ మందిర నిర్మాణానికి నిర్వహించే భూమి పూజకు తాను హాజరవుతానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. అయోధ్యలో జరిగే ప్రార్ధనల్లో తాను పాల్గొంటానని ఆయన శివసేన పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్ధారించారు. ‘నేను అయోధ్యకు వెళతా..భూమి పూజలో పాల్గొంటా..ముఖ్యమంత్రి కాకముందూ మందిర నిర్మాణం పట్ల విశ్వాసం ఉందని, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అయోధ్యకు వెళ్లి ప్రార్ధనల్లో పాల్గొంటా’నని చెప్పారు.