Dharani
Dharani
ఆడపిల్లను బరువుగా భావించే తల్లిదండ్రులు నేటికి కూడా మన సమజంలో లెక్కకు మించి ఉన్నారు. ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా పెళ్లి చేసి అత్తింటికి పంపి చేతులు దులుపుకునే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. మెట్టినింట్లో.. అందరి ప్రేమాభిమానాలు దొరికితే.. ఆమె జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. కానీ కట్టుకున్నవాడు తనను కనీసం మనిషిగా కూడా గుర్తించకపోతే.. ఆమె పడే బాధను వర్ణించడం ఎవరి తరం కాదు. పుట్టింటి వారు ఆదరించక.. అత్తింట్లో నరకం అనుభవించలేక.. చాలా మంది ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవాలని భావిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కూడా ఈ కోవకు చెందిన వ్యక్తే. పెద్దింటి సంబంధం అని.. వెనకాముందు ఆలోచించకుండా చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు. మెట్టినిలుల పెద్దదే కానీ.. అక్కడ ఉండే వారి మనసులు మాత్రం చాలా చిన్నవని ఆమెకు కాపురానికి వెళ్లిన కొత్తలోనే అర్థం అయ్యింది.
తాను వచ్చింది కోడలిగా కాదు.. పనిమనిషిగా అని కొన్ని రోజుల్లోనే అర్థం అయ్యింది. ఇంటెడు చాకిరీ చేసినా.. కడుపు నిండా తినడానికి లేదు. గర్భవతి అయ్యాక కూడా అదే పరిస్థితి. తల్లిదండ్రులకు చెబితే పిల్లలు పుట్టాక మారతారు లే.. ఓర్చుకో అన్నారు. భర్తకు తన బాధ చెబితే.. గొడ్డును బాధినట్లు బాధేవాడు. అంత పెద్ద ఇంటో ఆమె వేదన అరణ్య రోదన అయ్యింది. వేధింపులు తాళలేక.. చావే సుఖమనుకుంది. ఉరేసుకోబోయే ముందు ఆమె కళ్ల ముందు కనిపించిన దృశ్యం ఆమె ఆలోచన విధానాన్ని మార్చింది. ఆ నిమిషం ఆమె తీసుకున్న నిర్ణయంతో తన జీవితమే మారింది. కట్ చేస్తే నేడు ఆమె కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది.. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆమె గురించి మీ కోసం..
సవితా ప్రధాన్.. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, చంబల్‌కు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ కలెక్టర్ హోదాలో విధులు నిర్వహిస్తోంది. తెలివైన అధికారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. మరి ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి మృత్యువుతోనే పోరాటం చేసింది. మధ్యప్రదేశ్‌లోని మండీ గ్రామం సవితా ప్రధాన్ సొంతూరు. నిరుపేద ఆదివాసి కుటుంబంలో జన్మించింది. చదివించే స్థోమత లేకపోయినా.. బడికి వెళ్తే ఉచితంగా ఇచ్చే స్కాలర్‌షిప్, రాగి జావ, ఒక జత యూనిఫాం కోసం తల్లిదండ్రులు ఆమెను స్కూల్‌కు పంపేవారు. చదువంటే సవితకు ఎంతో ఇష్టం. బాగా కష్టపడి చదివి పది పాసయ్యింది.
పైచదువులు చదివి… మంచి ఉద్యోగం సంపాదించాలని కోరుకుంది. కానీ ఆమె ఆశలు అడియాసలు చేస్తూ.. పదో తరగతి పూర్తి కాగానే ఆమెకు వివాహం చేశారు తల్లిదండ్రులు. పెళ్లి కొడుకు ఆమె కన్నా పదకొండేళ్ల పెద్దవాడు. పెళ్లి చూపుల్లోనే అతడి వైఖరి ఎలాంటిదో ఆమెకు అర్థం అయ్యింది. దాంతో పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులు చెప్పింది. కానీ వారు ఆమె మాటను వినలేదు. పెద్దింటి సంబంధం అని బలవంతంగా సవితకు వివాహం చేశారు.
అత్తింటికి వెళ్లిన తర్వాత ఆమెకు వారి వ్యక్తిత్వాలు ఏంటో పూర్తిగా అర్థం అయ్యింది. తాను వచ్చింది ఆ ఇంటికి కోడలిగా కాదని.. పనిమనిషాగా అని త్వరలోనే అర్థం అయ్యింది. ఇంటి పని, వంట పని అంతా తానే చేయాలి. ఇంట్లో అందరూ భోజనం చేశాక… మిగిలింది తాను తినాలి. ఒకవేళ అన్ని అయిపోతే.. మళ్లీ వండకూడదు. ఆ పూటకు పస్తే. తల మీద కొంగు తీయకూడదు.. నవ్వ కూడదు.. నలుగురిలోకి రాకూడదు.. ఆఖరికి టీవీ కూడా చూడకూడదు. కాదని ఎదురు తిరిగితే.. రక్తం వచ్చేలా కొట్టేవారు.
ఇలా ఉండగానే సవిత గర్భం దాల్చింది. అప్పుడు కూడా సరిగా తింటి పెట్టేవారు కాదు. ఆకలికి తాళలేక.. రొట్టెలు దొంగతనం చేసి.. వాటిని లోదుస్తుల్లో దాచుకుని.. బాత్రూంలో కూర్చుని తినేది అంటే.. తన అత్తింటి వారు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు. తన కష్టాల గురించి తల్లికి చెబితే.. బిడ్డలు పుట్టాక అంతా అదే సర్దుకుంటుందిలే.. ఓర్చుకో అన్నది.
తల్లిదండ్రులు తనను ఆదరించరని ఆమెకు అర్థం అయ్యింది. ఇటు చూస్తే.. అత్తింట్లో వేధింపులు రోజురోజుకు పెరిగాయి. ఇలా ఉండగానే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది సవిత. అయినా తన పరిస్థితి మారలేదు. దాంతో జీవితం మీద విరక్తి వచ్చి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఫ్యాన్‌కు చీర బిగించి.. మెడకు చుట్టుకునేటప్పుడు ఎదురుగా కిటికీ బయట కనిపించిన దృశ్యం చూసి ఆమెకు షాక్ తగిలింది. అక్కడ ఆమె అత్తగారు నిల్చుని.. సవిత చేసే పనిని చూస్తున్నారు తప్పితే ఆపే ప్రయత్నం చేయలేదు.
ఆ నిమిషం సవితకు జ్ఞానోదయం అయ్యింది. ఛీ ఇలాంటి రాక్షసుల కోసమా.. బిడ్డలను సైతం వదిలి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.. అనుకుంది. తన నిర్ణయాన్ని తానే తిట్టుకుంది. పిల్లల కోసమైనా తాను బతకాలని నిర్ణయించుకుంది. వెంటనే చేతిలో ఉన్న రెండు వేలు తీసుకుని.. పిల్లలను వెంటబెట్టుకుని బయటకు నడిచింది.
అత్తింటి నుంచి బయటకు వచ్చిన సవిత.. దొరికిన ప్రతి పని చేసింది. బ్యూటీ పార్లర్‌లో అసిస్టెంట్, ఇండ్లలో పని మనిషి.. ఇలా ఏ పని దొరికితే.. ఆ పని చేసింది. పని చేసుకుంటూనే డిగ్రీ పూర్తి చేసింది. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసి.. యూనివర్శిటీ ఫస్ట్ వచ్చింది. ఏదో చిన్న ఉద్యోగం దొరికినా చాలనుకుని.. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇలా ఉండగా ఓ రోజు పేపర్ చదువుతుండగా.. యూపీఎస్సీ నోటిఫికేషన్ ఆమె కంట పడింది. అందులో ఆమెకు ముందుగా కనిపించింది జీతమే. ఎంత కష్టమైనా సరే.. ఆ ఉద్యోగం సాధించాలని భావించింది. రేయింబవళ్లు కష్టపడి చదివి.. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. అలా 24 ఏళ్లకే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ అయ్యింది సవిత.
ఇంటి నుంచి బయటకు వచ్చి.. తన బతుకు తాను బతుకుతున్నా భర్త వేధింపులు మాత్రం తగ్గదం లేదు. సవిత ఎక్కడుంటే అక్కడకు వచ్చి కొట్టేవాడు. దాంతో అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేసి.. విడాకులు తీసుకుంది. ఆమెను అర్థం చేసుకున్న హర్షను రెండో వివాహం చేసుకుని.. ఎంతో సంతోషంగా జీవిస్తోంది. తనలాగా.. అత్తింట్లో వేధింపులు భరించే ఆడవాళ్ల కోసం హిమ్మత్ వాలి లడ్కియా పేరు పేరు మీద యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి.. తన జీవితానే పాఠాలుగా బోధిస్తూ.. వారిలో ధైర్యం నింపి.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది సవితా. చిన్న చిన్న విషయాలకే జీవితాలను అంతం చేసుకునేవారు.. ఒక్క సారి సవిత గురించి తెలుసుకుంటే.. జీవితం విలువ తెలుస్తుంది అంటున్నారు స్థానికులు.