Idream media
Idream media
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రేటర్ లోని నాయకులతో పాటు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నేతలు ఇక్కడకు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. అనంతరం తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. గ్రేటర్ తో సంబంధం లేని వారు కాబట్టి ఓకే. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల సమయంలో మాత్రం అక్కడే తిష్ట వేసిన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ బాబు.. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ అడపాదడపా ఏపీకి వెళ్లి వస్తున్నారు. ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలైనప్పటికీ టూరిస్టులుగా రాష్ట్రాన్ని సందర్శించి వెళ్తుండడం ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. వారిద్దరూ వంతుల వారీగా అప్పుడప్పుడు రాష్ట్రానికి వస్తూ ఏదో ఒక హడావుడి చేసి వెళ్లిపోతుండడంపై తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పూర్తిగా పక్క రాష్ట్రంలోనే…
గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్న చంద్రబాబు.. కరోనా విజృంభణ తర్వాత పూర్తిగా అక్కడికే పరిమితమయ్యారు. నెలకో, రెండు నెలలకో ఒకసారి రాష్ట్రానికి వచ్చి జూమ్‌లో ఒకటి, రెండు కాన్ఫరెన్సులు పెట్టి వెళ్లిపోతుండడంపై సీనియర్ నాయకులే అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడకు వచ్చినప్పుడు కూడా పార్టీ ముఖ్య నాయకులను కలవక పోవడం, ఇక్కడి నుంచి కూడా ఆన్లైన్లో మాట్లాడుతుండడంపై పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆన్లైన్ సమావేశాల్లో పలుమార్లు అయ్యన్నపాత్రుడు వంటి సీనియర్లు ఈ విషయాన్ని లేవనెత్తి ప్రశ్నించారు. పార్టీ అధినేత రాష్ట్రంలో ఉండకుండా హైదరాబాద్‌లో ఉండడం వల్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని, ఈ పద్ధతి సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు చిన్న బాబు
పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రతివారం తానుగానీ, తన కుమారుడు గానీ రాష్ట్రానికి వస్తామని చంద్రబాబు పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఒక వారం చంద్రబాబు ఉండవల్లి వస్తే మరోవారం లోకేష్ వస్తున్నారు. గత వారం చంద్రబాబు వచ్చి నాలుగు రోజులు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నారు. అప్పుడు కూడా నాయకులు ఎవరినీ ఆయన దరిదాపుల్లోకి వెళ్లనీయలేదు. ఆన్లైన్లోనే సమావేశాలు నిర్వహించి దీపావళి ముందు హైదరాబాద్ వెళ్లిపోయి తన వంతు పూర్తి చేసుకున్నారు. తాజాగా ఆయన కుమారుడు లోకేష్ వంతు రావడంతో మంగళవారం వచ్చారు. ఆయన రెండు రోజులు ఉండి ఏదో ఒక టూర్ పెట్టుకుని మళ్లీ వెళ్లిపోయేలా ప్రణాళిక రూపొందించారు. 20 రోజుల క్రితం తన వంతులో భాగంగా లోకేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల బలవంతం మీద అతికష్టంగా పర్యటించారు. ఆ తర్వాత వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయి చాలా రోజులు రాలేదు. మళ్లీ ఇప్పుడే వచ్చారు. ఈయన వంతు పూర్తయ్యాక ఆ తర్వాత వారమో, రెండో వారమో చంద్రబాబు వస్తారని పార్టీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. సొంత పార్టీలోనే ఇలా ఉంటే.. ఇక ప్రజలు ఏమనుకుంటున్నారో..!