iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ రివ్యూ 56 – లక్ష్మి

  • Published Nov 09, 2020 | 6:07 PM Updated Updated Nov 09, 2020 | 6:07 PM
లాక్ డౌన్ రివ్యూ 56 – లక్ష్మి

బాలీవుడ్ లో గత కొంత కాలంగా భారీ అంచనాలు మోసుకొచ్చి విడుదల వాయిదా పడుతూ వచ్చిన లక్ష్మి ఎట్టకేలకు ఇవాళ డిస్నీ హాట్ స్టార్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం 2011లో వచ్చిన తమిళ సినిమా కాంచన రీమేక్ గా రూపొందిన లక్ష్మి వివాదాలను సైతం ఎదురుకోవాల్సి వచ్చింది . ముఖ్యంగా లవ్ జిహాద్ ప్రమోట్ చేసేలా ఉందని కొన్ని వర్గాలు అభ్యంతరం లేవనెత్తినప్పటికీ డిజిటల్ రిలీజ్ కాబట్టి అవేవి సినిమాను అడ్డుకోలేకపోయాయి. మరి అక్షయ్ కుమార్ మొదటిసారి హిజ్రాగా నటించిన లక్ష్మి ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

ఆసిఫ్(అక్షయ్ కుమార్) రశ్మి(కీయరా అద్వానీ)ను ప్రేమ పెళ్లి చేసుకుని చనిపోయిన అతని అన్నయ్య కొడుకుతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఈ మతాంతర వివాహం ఇష్టం లేని రశ్మి తండ్రి(రాజేష్ శర్మ)వీళ్ళను దూరంగా ఉంచుతాడు. అయితే తమ సిల్వర్ జూబ్లీ వేడుకకు రమ్మని రశ్మి తల్లి ఫోన్ చేసి పిలవడంతో ఇద్దరు అక్కడికి వెళ్తారు. ఓ రోజు వాళ్ళింటికి దగ్గరలో ఉన్న క్రికెట్ గ్రౌండ్ లో పిల్లలతో కలిసి ఆడుకుని వచ్చిన ఆసిఫ్ విచిత్రంగా అమ్మాయిలా ప్రవర్తించడం మొదలుపెడతాడు. దర్గా బాబాను తీసుకొచ్చాక ఆసిఫ్ లో ఉన్న లక్ష్మి శర్మ ఉరఫ్ లక్ష్మి (శరద్ కేల్కర్)అనే హిజ్రా దెయ్యం గురించి తెలుస్తుంది. అసలు తను ఇదంతా ఎందుకు చేసింది దీనికి ల్యాండ్ మాఫియా డాన్ ఎమెల్యే గిర్జా(తరుణ్ అరోరా)కు ఉన్న సంబంధం ఏమిటనేది మనవాళ్ళు ఎప్పుడో చూసేసిన ఫ్లాష్ బ్యాక్.

నటీనటులు

కాంచనను అక్షయ్ కుమార్ ఇంతగా ప్రేమించి చేయడానికి కారణం అందులో హిజ్రా లక్షణాలున్న పాత్రలో చాలా షేడ్స్ పోషించే అవకాశం ఉండటమే. దానికి అతను సంపూర్ణ న్యాయం చేకూర్చాడు. అయితే వయసు దృష్ట్యా కొంత ఆలస్యం చేయడంతో అక్కడక్కడా నప్పలేదు అనిపిస్తుంది కూడా. కాని సీనియర్ హీరోల్లో ఇంత గ్రేస్ తో చేయగలిగే బాలీవుడ్ హీరో తనే అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. షాపింగ్ మాల్ లో చీర కట్టుకునే సన్నివేశంలో, క్లైమాక్స్ సాంగ్ లో, అపరిచితుడు తరహా యాక్షన్ సీన్ లో లారెన్స్ ని మరిపించాడు.

కియరా అద్వానీ ఉండాలంటే ఉంది అంతే. అక్షయ్ పక్కన పాటల్లో తప్ప సన్నివేశాల్లో అతనికి తగ్గ జోడిగా కనిపించలేదు. వయసులో భారీ వ్యత్యాసం ఉండటమే కారణం. లుక్స్ పరంగా చాలా బాగుంది. ఇక అసలైన హిజ్రాగా నటించిన శరద్ కేల్కర్ మాత్రం విశ్వరూపం చూపించాడు. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ లో విలన్ గా చేసిన ఇతను అంతగా గుర్తుండపోకవచ్చు కానీ ఇందులో మాత్రం కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కనిపించేది కాసేపే అయినా చెడుగుడు ఆడేశాడు. కియరా కుటుంబసభ్యులుగా నటించిన అయేషా రజా మిశ్రా, మను రిషి చద్దా, అశ్విని కలేస్కర్ ఓవర్ యాక్షన్ చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు కానీ అంతగా పండలేదు

డైరెక్టర్ అండ్ టీం

దర్శకుడు లారెన్స్ రాఘవేంద్ర తీసుకున్న కాంచన కాన్సెప్ట్ తను ఒరిజినల్ గా చేసిన టైంలో కొత్తగా అనిపించింది. అప్పటిదాకా ఆడియన్స్ కు పరిచయం లేని హారర్ మాస్ కామెడీని ఊర మాస్ పద్ధతిలో చూపించడంతో పెద్ద హిట్టయ్యింది. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. అది గుర్తించే ఈ రీమేక్ కు చెప్పుకోదగ్గ మార్పులు చాలానే చేశాడు కానీ అవే తేడా కొట్టాయి. ఒరిజినల్ వెర్షన్ లో హీరోని పిరికివాడిగా చూపించడం బాగా ప్లస్ అవ్వడంతో పాటు కామెడీకి ఎక్కువ స్కోప్ దొరికింది. కాని అక్షయ్ కుమార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని మరీ అంత అతి చేయిస్తే బాగుండదేమోనని ఆ క్యారెక్టర్ ని సాఫ్ట్ చేయడం ఒకరకంగా మైనస్ అయ్యింది.

టేకాఫ్ చేయించిన విధానం బాగానే ఉన్నప్పటికీ కథనం ముందుకు వెళ్లేకొద్ది లక్ష్మి కాస్తా సహనానికి పరీక్షగా మారుతుంది. అందులోనూ అక్షయ్ కోసమే అన్నట్టుగా లారెన్స్ చేసిన మార్పులు కొంతవరకే పాజిటివ్ గా అనిపిస్తాయి. దెయ్యాల సినిమాల్లో లాజిక్స్ ఉండవు నిజమే. అందులోనూ లారెన్స్ కు ఆ పదం అంటేనే గిట్టదు. ఆశించడం కూడా కరెక్ట్ కాదు. కానీ స్టార్ హీరోతో డీల్ చేస్తున్నప్పుడు మరీ నేల విడిచి సాము చేయకూడదు. చిన్న పొరపాటు కూడా భారీ మూల్యం చెల్లించేలా చేస్తుంది. లక్ష్మిలో జరిగింది అదే. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఇంట్లో జరిగే ప్రహసనం అంతా ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసేలా చేసింది. అయినా కూడా ఓపిగ్గా భరించేలా ఉన్నామంటే దానికి కారణం అక్షయ్ కుమార్, శరద్ కేల్కర్లే. క్లైమాక్స్ పరమ రొటీన్ గా మార్చేశారు.

అమర్ మొహిలే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ కు తగ్గట్టు సాగింది. మరీ ఓవర్ సౌండ్ లేకుండా డీసెంట్ గా ఇచ్చాడు. నలుగురు సంగీత దర్శకులు కలిసి ఇచ్చిన పాటల్లో మాస్ కు బూర్జ్ ఖలీఫా ఒక్కటే కాస్త కనెక్ట్ అయ్యేలా ఉంది. స్తోత్రానికి రీమిక్స్ చేసి బీట్లు కలిపి కొట్టిన చివరి పాట ప్రయోగం కూడా అంతంతే. వెట్రిపళనిస్వామి-ఖుష్ చాబ్రియా ఛాయాగ్రహణం గురించి ఫిర్యాదు చేయడానికి ఏమి లేదు. రాజేష్ జే పాండే ఎడిటింగ్ బాగానే కష్టపడింది కానీ లెంత్ ఎక్కువే అనిపిస్తుంది. తుషార్ అండ్ కో ప్రొడక్షన్ వేల్యూస్ మాత్రం రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ గా అనిపించేవి

అక్షయ్ కుమార్ నటన
శరద్ కేల్కర్ పెర్ఫార్మన్స్
కెమెరా వర్క్
బిజిఎం

మైనస్ గా అనిపించేవి

వర్కవుట్ అవ్వని కామెడీ
అవుట్ డేట్ అయిన కాన్సెప్ట్
క్యాస్టింగ్
సెకండ్ హాఫ్ సాగతీత

కంక్లూజన్

కాంచనతో హారర్ జానర్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన లారెన్స్ అదే మేజిక్ ని బాలీవుడ్ లో పునఃసృష్టించడంలో ఫెయిల్ అయ్యారు. అక్షయ్ కుమార్, శరద్ కేల్కర్ పెర్ఫార్మన్సులు దన్నుగా నిలిచినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే స్థాయిలో పకడ్బందీ స్క్రిప్ట్ ని తీర్చిదిద్దుకోవడంలో తడబడటంతో ఒరిజినల్ వెర్షన్ చూడనివాళ్ళకు సైతం లక్ష్మి స్పెషల్ గా అనిపించదు. కేవలం ఇద్దరి నటన కోసం రెండున్నర గంటల కాలాన్ని ఖర్చు పెట్టగలిగితే లక్ష్మిని ఆప్షన్ గా పెట్టుకోవచ్చు కానీ అంతకు మించి ఆశిస్తే మాత్రం తప్పు చూసేవాళ్ళదే

లక్ష్మి – పేలని బాంబు