iDreamPost
android-app
ios-app

మందుబాబుల బాధ‌లు

మందుబాబుల బాధ‌లు

తిరుప‌తి-రేణిగుంట మ‌ధ్య‌లో వైన్‌షాప్‌కి క‌న్న‌మేసి మందుబాబులు బాటిళ్లు ఎత్తుకెళ్లారు. కేసు ఇన్వెస్టిగేష‌న్‌కి పోలీసులొచ్చి షాపు ష‌ట్ట‌ర్ Open చేశారు. దాంతో షాపు తెరిచార‌ని ఎక్క‌డెక్క‌డి మందుబాబులొచ్చి చుట్టుముట్టారు. ఒక బాటిల‌యినా ఇవ్వ‌మ‌ని పోలీసుల్ని ప్రాథేయ‌ప‌డ్డారు. మందు దోచుకున్న వాళ్ల‌ని పోలీసుల కంటే ఎక్కువ‌గా మందు బాబులే వెతుకుతున్నార‌ట‌.

లాక్‌డ‌వున్‌తో మందుబాబులు నెర్వ‌స్ డ‌వున్ అవుతున్నారు. ప‌ల్లెల్లో అయితే నాటుసారా తాగేస్తున్నారు. ట‌వున్ల‌లో క‌ష్టంగానే ఉంది. లాక్‌డ‌వున్ ఎత్తే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. పొడిగిస్తారేమోన‌ని భ‌య‌ప‌డి చ‌స్తున్నారు.

ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింద‌న్న‌ట్టు, క‌రోనాతో పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. మార్చి 22 పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. అబ్బాయి , అమ్మాయి చెన్నైలో సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్లు. కొత్త కాపురం పెట్ట‌డానికి ప్లాట్ అద్దెకి తీసుకున్నారు. తాము వుంటున్న ఇల్లు ఖాళీ చేస్తామ‌ని చెప్పేశారు. పెళ్లి ఆగిపోయింది.

పెళ్లి మీ ఇష్ట‌మొచ్చిన‌పుడు చేయండి, అప్ప‌టి వ‌ర‌కూ ఒకే ప్లాట్‌లో వుంటామ‌ని చెప్పి క‌లిసి వుంటున్నారు. పెద్ద‌వాళ్లు బుర్ర‌లు గోక్కున్నారు అంతే.

క‌రోనాతో మాన‌వ సంబంధాల్లో అనుకోని మార్పులొస్తున్నాయి. లాక్‌డౌన్‌తో అనేక కుటుంబాలు గ్రామాల‌కి చేరుకున్నాయి. ఎప్పుడో ద‌స‌రా సెల‌వుల‌కి ప‌ల్లెలకు రావ‌డం త‌ప్ప‌, పిల్ల‌ల‌కి ఇన్ని రోజులు ప‌ల్లెల్లో ఉండ‌డం తెలియ‌దు. స్కూల్ బ‌స్సులు, హోంవ‌ర్క్‌ల నుంచి విముక్తి చెంది ఇళ్ల‌లో అవ్వాతాత‌ల‌తో గ‌డుపుతున్నారు. తోట‌ల్లో వ్య‌వ‌సాయం చేసుకుంటున్నారు.

చిట్వేలి ద‌గ్గ‌ర ఒక గ్రామానికి హైద‌రాబాద్ నుంచి సాఫ్ట్‌వేర్ కుటుంబం వ‌చ్చింది. బంధువులంతా క‌లిసి 20 మంది . తెల్లారి అడ‌వికి వెళ్లి క‌ట్టెలు కొడుతున్నారు. కుందేళ్ల‌ను వేటాడుతున్నారు. న‌గ‌ర‌మ‌నే అడ‌వి నుంచి నిజ‌మైన అడ‌వికి వ‌చ్చారు.

కొన్ని గ్రామాల్లో సారా కాచే వాళ్ల‌కి హ‌ఠాత్తుగా డిమాండ్ పెరిగింది. వేల రూపాయ‌లు అడ్వాన్స్‌లు ఇచ్చి క‌ల్తీ లేని సారా కాయిస్తున్నారు.

ప‌ల్లెల్లో నెట్ సిగ్న‌ల్ స‌రిగా రాక‌పోవ‌డంతో , అంద‌రూ గ్రామీణ ఆట‌లే ఆడుతున్నారు. క‌బడ్డీ, పాము ప‌టం, బారాక‌ట్ట ఆడుకుంటున్నారు.

జ‌రుగుబాటు ఉన్న ఇళ్ల‌లో ప‌ల్లెటూరి వంట‌కాలు గుమ‌గుమ‌లాడుతున్నాయి. నాటుకోళ్ల‌న్నీ మాయ‌మై పోతున్నాయి.

మ‌హిళా కూలీల‌కు కావాల్సినంత తీరుబాటు దొరుకుతోంది. స్కూల్లో మ‌ధ్యాహ్న భోజ‌నం త‌ప్ప , ఇంటి భోజ‌నం తిన‌ని పిల్ల‌ల‌కు వండి పెట్టేంత తీరిక దొరికింది. కానీ వండుకోడానికే ఇంట్లో ఏమీ లేవు