వారికి చెలగాటం… వీరికి పదవి సంకటం..

ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు ఇక రాజకీయ జీవితానికి తిరుగులేనట్లే. గెలిచినా, ఓడినా ప్రతిసారి నాకే టికెట్‌ వస్తుంది. ఒకసారి కాకపోయినా మరోసారి గెలుస్తా. పార్టీ అధికారంలోకి వచ్చిందంటే నేను ఎమ్మెల్యేగా గెలవకపోయినా నియోజకవర్గంలో పెత్తనం చెలాయించవచ్చు. ఇదీ రాజకీయ నాయకుల ధోరణి. అయితే ఇకపై ఈ పంథా సాగబోదు. అందుకు కారణం అధికార పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న సంచలన నిర్ణయమే.

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తేడా వస్తే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటు దక్కదని సీఎం జగన్‌ కరాఖండిగా చెప్పేశారు. 90 శాతం పదవులు వైఎస్సార్‌సీపీయే గెలుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఏం తేడా వచ్చినా.. ఎమ్మెల్యే రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాఫ్‌ పడినట్లే. అందుకే ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది. లక్ష్యం చేరుకునేందుకు ఉన్న దారులను వెతుకుతున్నారు. వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలు ఉన్న నియోజకవర్గ నేతల్లో ఓకింత ఆందోళన మొదలైంది. తన ప్రత్యర్థి ఎక్కడ తనకు వెన్నుపోటు పొడుస్తాడోనని వణికిపోతున్నారు.

అధికార పార్టీ అంటనే అంతర్గత కుమ్ములాటలు సహజం. స్థానిక సంస్థల్లో గెలవడం కన్నా పార్టీలో తన పోటీదారుడును దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతుంటారు. ప్రస్తుతం అధికార పార్టీలో ఉత్తరాంధ్ర మినహా అన్ని జిల్లాలో అంతర్గత వర్గపోరు నడుస్తోంది. చిత్తూరు జిల్లాలో సినీ నటి రోజా ప్రతినిధ్యం వహిస్తున్న నగరిలో స్థానికంగా ఉన్న ఓ వర్గం కార్యకర్తలు రోజాను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఆమె కారును అడ్డగించారు. వారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండగా ఉన్నారని ప్రచారం సాగింది. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్భాల్‌ అహ్మద్, పార్లమెంట్‌ అధ్యక్షుడు నవీన్‌ నిశ్చల్‌లకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బైరెడ్డికి సపోర్టుగా ఉన్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను ఎమ్మెల్యే ఆర్థర్‌ వర్గీయులు గెరావ్‌ చేశారు. నెల్లూరు జిల్లాలో నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది.

ప్రకాశం జిల్లా చీరాలలో కో ఆర్డినేటర్‌ ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత మధ్య వివాదాలు నడుస్తున్నాయి. జూపూడి ప్రభాకర్‌ తిరిగి పార్టీలో చేరడంతో కొండపిలో కూడా కుమ్ములాటలు తప్పేలా లేవు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజనీ, స్థానిక నేత మర్రి రాజశేఖర్‌ల మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి లో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పివిఎల్ నరసింహ రాజుల మధ్య వర్గపోరు సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రరవం సిటీలో కో ఆర్డినేటర్‌ శిఘాకోళ్లపు శివరామసుబ్రమణ్యం, పూర్వపు కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, ఎంపీ మార్గాని భరత్, జక్కంపూడి విజయలక్ష్మీలు ఎవరి గ్రూపుల వారు నడుపుతున్నారు. గత ఎన్నికల్లో అంతర్గత వెన్నుపోట్ల వల్లనే రౌతు ఓడిపోయారని ప్రచారం సాగుతోంది. కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ వర్గపోరు తప్పని పరిస్థితి రాజమహేంద్రరంలో ఉంది. ఇలా ప్రతి నియోజకవర్గంలో బయటకుపొక్కని కుమ్ములాటలున్నాయి. వాటిని ఏ మేరకు సర్ధుబాటు చేసుకుంటారన్న దానిపైనే ఎమ్మెల్యేలు, నేతల భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు, 24 మంది కో ఆర్డినేటర్లలో ఎంత మంది ‘స్థానిక’ గండం నుంచి గట్టేక్కుతారో మరో నెల రోజుల్లో తేలనుంది.

Show comments