స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 9వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలతో కూడిన నివేదికను ఈ రోజు హైకోర్టుకు సమర్పించింది.

వివరాలు స్వీకరించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 8వ తేదీన తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 9న చిత్తూరు జిల్లా కుప్పంలో అమ్మ ఒడి పథకాన్ని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత స్థానిక పోరు షురూ కానుంది.

ఈ నెల 14, 15, 16 తేదీల్లో సంకాంత్రి పండుగ రాబోతోంది. పండగకు ముందే నోటిఫికేషన్‌ ఇవ్వాలా..? లేదా పండగ తర్వాత ఇవ్వాలా…? అన్న అంశంపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.

హైకోర్టు ఆదేశాలతో అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు అవసరమైన సమాచారంతో నివేదికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. 8వ తేదీకి మరో నాలుగు రోజులు సమయం మాత్రమే ఉండడంతో అధికారులు ఏ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై కసర త్తు చేస్తున్నారు. ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా..? లేక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా..? అన్న అంశంపై ఉన్నతాధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ గుర్తుపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతోందన్న ప్రచారం సాగుతోంది.

Show comments