60 ఏళ్ళు, ఆపై వయసున్న సీనియర్ సిటిజన్లు ఇకపై నెలనెలా పెన్షన్ అందుకోవచ్చు. LIC పెన్షన్ స్కీమ్ ఈ మేరకు వచ్చే పదేళ్ళ దాకా భరోసా ఇస్తోంది. ఒకేసారి 15 లక్షలు కడితే ఆ తర్వాతి నెల నుంచే 9 వేల 250 రూపాయలు పెన్షన్ వస్తుంది. పదేళ్ళ తర్వాత కట్టిన మొత్తం తిరిగొస్తుంది. LIC ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడైజ్డ్ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. దీని గడువు వచ్చే ఏడాది మార్చి 31కి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి కావల్సిన అర్హతలు, కాల పరిమితి, ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం.
పెన్షన్ స్కీమ్ అర్హతలేంటి?
60 ఏళ్ళు నిండిన లేదా దాటిన సీనియర్ సిటిజన్లు ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) పాలసీని కొనుక్కోవచ్చు. దీనికి గరిష్ట వయో పరిమితంటూ ఏదీ లేదు.
కాల పరిమితి, చెల్లింపు విధానం
ఈ పెన్షన్ స్కీమ్ కాల పరిమితి పదేళ్ళు. పెన్షనర్ ఎంచుకున్న మోడ్ ని బట్టి ప్రతి నెల లేదా మూడు నెల్లకోసారి లేదా ఆరు నెల్లకోసారి లేదా ఏడాదికోసారి పెన్షన్ పొందవచ్చు.
PMVVY పెన్షన్ స్కీమ్ ప్రధానంగా పెన్షన్ ఇస్తుంది. పెన్షన్ దారు ఎంపిక చేసుకున్న ప్లాన్ ని బట్టి పదేళ్ళ పాటు పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ ఈ పదేళ్ళ కాలంలో పెన్షనర్ గనక చనిపోతే పాలసీ కొన్న మొత్తాన్ని లబ్ధిదారుకు చెల్లిస్తారు. అలా కాకుండా పదేళ్ళ పాటు పెన్షనర్ బతికే ఉంటే కట్టిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు.
వడ్డీ రేటు, గరిష్ట, కనిష్ట కొనుగోలు రేటు
మార్చి 31, 2023 లోపు కొన్న పాలసీలకు ఏటా 7.40 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ప్రతి నెలా కనిష్టంగా వెయ్యి రూపాయల పెన్షన్ పొందే వీలుంది. గరిష్టంగా నెలకు 9 వేల 250 రూపాయల పెన్షన్ తీసుకోవచ్చు. అంటే సంవ్సతరానికి లక్షా 11 వేల రూపాయలు పెన్షన్ రూపంలో చేతికొస్తాయి. 15 లక్షలు గరిష్ట పరిమితి. అంత కట్టలేము అనుకుంటే లక్షా 62వేల 620 రూపాయలు కడితే నెలనెలా కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ చేతికొస్తుంది. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ పెన్షన్ ప్లాన్లకు కనిష్ట, గరిష్ట మొత్తాలు స్వల్పంగా మారతాయి.