iDreamPost
iDreamPost
కోట్లాది భారతీయ సంగీతం ప్రేమికులను విషాదంలో ముంచెత్తుతూ గాన కోకిల లతా మంగేష్కర్ అస్వస్థతతో ఇవాళ కన్ను మూశారు. ఆవిడ వయసు 92. కొన్ని నెలల క్రితం కరోనా బారిన పడిన లతా మంగేష్కర్ ఆ తర్వాత కోలుకున్నప్పటికీ అనారోగ్యం మళ్ళీ తిరగబడటంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1929 సెప్టెంబర్ 28 జన్మించిన లతా గారి అసలు పేరు హేమా మంగేష్కర్. నైటింగేల్ అఫ్ ఇండియా, క్వీన్ అఫ్ మెలోడీ లాంటి ఎన్నో బిరుదులు ఆవిడ కీర్తి కిరీటంలో కొన్ని మచ్చుతునకలు. పద్మభూషణ్ (1969), దాదా సాహెబ్ ఫాల్కే(1989), మహారాష్ట్ర భూషణ్(1997), పద్మవిభూషణ్(1999), భారత రత్న(2001), లెజియన్ అఫ్ హానర్ (2006) లాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అత్యున్నత పురస్కారాలు అందుకున్న మహోన్నత చరిత్ర లతగారిది.
1999 నుంచి 2005 మధ్యలో రాజ్యసభ తరఫున ఎంపిగానూ విశిష్ట సేవలు అందించారు. సుమారు 36 భారతీయ భాషల్లో పాటలు పాడిన అరుదైన ఘనత లతా గారికే సొంతం. మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్ అస్సోసియేషన్ తరఫున 15 సార్లు అవార్డు అందుకున్న అరుదైన రికార్డు కూడా ఆవిడకే సొంతమయ్యింది. 1974లో లండన్ లో ఉన్న రాయల్ ఆల్బర్ట్ హాల్ లో పాటలు పాడిన మొదటి భారతీయ గాయకురాలిగా లతా అందుకున్న గౌరవం చాలా విశిష్టమైనది. ఈమెకు నలుగురు తోబుట్టువులు. మీనా ఖడికర్, ఆశా భోంస్లే, ఉషా మంజ్రేకర్, హృదయనాథ్ మంజ్రేకర్. 1942లో లతా వయసు 13 ఉన్నప్పుడు తండ్రి చనిపోయారు. అప్పటికే ఈమె ప్రతిభను గుర్తించిన మాస్టర్ వినాయక్ అనే వ్యక్తి గాయనిగా కెరీర్ మొదలుపెట్టడానికి సహాయపడ్డారు.
మరాఠీ సినిమా కితి హాసల్(1942)లో మొదటిసారి పాడారు. ముంబైకి చేరుకున్నాక హిందీలో పాడిన తొలిగీతం ఆప్కి సేవా మే(1946)సినిమా కోసం.అక్కడి నుంచి మొదలు లతా గారి ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. ముఖ్యంగా 70వ దశకం నుంచి ఉచ్ఛస్థితిని చూశారు. ఆవిడ పాట ఆల్బమ్ లో లేదంటే హక్కులు కొనేందుకు ఆడియో కంపెనీలు తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. స్టార్లకు ధీటుగా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ప్లే సింగర్లలో లతా గారిదే మొదటి స్థానం. ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్, లక్ష్మికాంత్ ప్యారేలాల్ తో మొదలుపెట్టి ఏఆర్ రెహమాన్ దాకా అందరికీ పాడిన ఘనత ఆవిడది. తెలుగులో కొన్ని మధురమైన గీతాలు ఆలపించారు లతా. ఆఖరి పోరాటం(1988)సినిమాలో తెల్లచీరకు తకధిమి తపనలు పాట ఎవర్ గ్రీన్ క్లాసిక్. లతా మంగేష్కర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఈ భూమి ఉన్నంత కాలం పాటల్లో ఆవిడ ఎప్పుడూ సజీవంగానే ఉంటారు
Also Read : Allu Arjun : ఏ భాషలోనూ లాజిక్స్ ఉండవు కదా