iDreamPost
android-app
ios-app

మాస్ ని ఆకట్టుకున్న లీలామహల్ – Nostalgia

  • Published Sep 29, 2021 | 11:22 AM Updated Updated Sep 29, 2021 | 11:22 AM
మాస్ ని ఆకట్టుకున్న లీలామహల్ – Nostalgia

సినీ రంగం మీద సినిమాలు రావడం సహజమే. అద్దాల మేడ, శివరంజనితో మొదలుపెట్టి మహానటి దాకా చాలానే వచ్చాయి. అయితే థియేటర్ ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని వచ్చినవి మాత్రం అరుదు. అందులో ఒకటి లీలామహల్ సెంటర్. తిరుపతి వాసులకు ఈ పేరు బాగా సుపరిచితం. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ హాలు ఎన్నో ఇండస్ట్రీ హిట్లకు వేదిక. ఆ పేరుతో ఒక చిత్రం రావడం అంటే విశేషమేగా. ఆ సంగతులు చూద్దాం. 1999లో అజిత్ హీరోగా ‘అమర్కలం’ అనే సినిమా వచ్చింది. షాలిని(అప్పటికి వీళ్లిద్దరికీ పెళ్లి కాలేదు) హీరోయిన్ గా రఘువరన్, రాధికా, నాజర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకుంది.

అజిత్ షాలిని ప్రేమకు శ్రీకారం ఈ షూటింగ్ లోనే జరిగిందని అప్పట్లో కథనాలు వచ్చేవి. దీన్ని తెలుగులో ‘అద్భుతం’ పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు కానీ సరైన మార్కెటింగ్ లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ఇది జనానికి చేరలేదు. బిసి సెంటర్స్ లో ఓ మోస్తరుగా ఆడింది. రమణి భరద్వాజ్ అందించిన సంగీతం మాత్రం మంచి హిట్. ముఖ్యంగా వేటూరి రాసి బాలు పాడిన ‘నిత్యం ఏకాంత క్షణమే అడిగా’ బాగా పాపులర్. బ్రీత్ లెస్ సాంగ్స్ లో దీనిదో ప్రత్యేక ట్రెండ్. ఇదే సినిమాని మళ్ళీ తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో నిర్మాత సిహెచ్ మోహన్ హక్కులు కొని ఆర్యన్ రాజేష్-సదా జంటగా దేవీప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కించారు.

తల్లితండ్రులు ఉన్నా వాళ్ళ ప్రవర్తన వల్ల ఒక థియేటర్ నే ఇల్లుగా మార్చుకుని అనాథగా పెరిగిన ఓ కుర్రాడు, పెద్ద పోలీస్ కుటుంబం నుంచి వచ్చి మాఫియా వలలో ఇరుకున్న ఓ అమ్మాయికి మధ్య ప్రేమకథగా దీన్ని రూపొందించారు. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం సమకూర్చారు. అసలు కథ కన్నా సినిమా హాల్ మేనేజర్ గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసిన కామెడీ అద్భుతంగా పేలింది. పెదరాయుడు, ఠాగూర్, అమ్మోరు వేషాలతో ఆయన చేసిన పాత్ర విపరీతంగా నవ్వించింది. అయితే ఒరిజినల్ వెర్షన్ రేంజ్ లో లీలామహల్ సెంటర్ ఇక్కడ గొప్ప విజయం సాధించలేదు కానీ కమర్షియల్ గా పాస్ అయ్యేలా ఆడింది. 2004 డిసెంబర్ 4న ఈ సినిమా వంశీ కొంచెం టచ్ లో ఉంటే చెబుతానుతో పాటుగా రిలీజయ్యింది

Also Read : ఖాకీ చొక్కాకు గౌరవం తెచ్చిన అంకుశం – Nostalgia