Taj mahal తాజ్ మహల్ ఉన్న స్థలం మాదే, బీజేపీ ఎంపీ వ్యాఖ్య‌లు

ఆగ్రాలోని తాజ్ మ‌హ‌ల్ పై బీజేపీ ఎంపీ దియా కుమారి చేసిన వ్యాఖ్యలు సంచల‌న‌మైయ్యాయి. ఆమె జైపూర్ మాజీ యువరాణి. తాజ్ మహల్ కట్టింది మా స్థలంలోనేనని, అందువ‌ల్ల తాజ్ మ‌హ‌ల్ మా స్వంత ఆస్థి అని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అన్నారు. తాజ్ మ‌హ‌ల్ ఏంటి? ఇది మాదేన‌ని బీజేపీ ఎం అన‌డ‌మేంటి?

తాజ్ మహల్ లోని మూసి ఉన్న 22 గదుల తలుపులు తెరవాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయోధ్య బీజేపీ నేత డాక్టర్ రజనీష్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి ఆమె మద్దతు ప‌లికారు. తాజ్ మహల్ నిర్మించిన భూమి జైపూర్ పాలకుడు జై సింగ్ కు చెందినది అన్న‌ది ఆమె వాద‌న‌. ఈ భూమిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ స్వాధీనం చేసుకొన్నారని, జైపూర్ రాజ కుటుంబ‌ రికార్డులు అందుబాటులో ఉన్నాయని ఆమె అంటున్నారు. భూమికి బదులు పరిహారాన్ని షాజ‌హాన్ ఇచ్చాడని, కానీ ఎంత మొత్తంలో పరిహారం ఇచ్చారనేది తనకు తెలియదన్నారు. తాజ్ మహల్ నిర్మించక ముందు అక్కడ ఏముందో తెలుసుకొనే హక్కు ప్రజలకు ఉందని, ప్రస్తుతం జైపూర్ కుటుంబం వద్ద రికార్డ్స్ ఉన్నాయన్నారు.

అదిస‌రే, ఒక‌వేళ అన్ని ఆధారాలు ఉన్నాయ‌నుకుందాం. మ‌రి ఇంత‌వ‌ర‌కు ఎందుకు ఈ విష‌యాన్ని లేవ‌నెత్త‌లేదు? అప్పట్లో న్యాయ వ్యవస్థ అందుబాటులో లేకపోవడం, ఆయన్ను ఎదిరించే సాహసం తమ పూర్వీకులు చేయలేక పోయారని తెలిపారు. బీజేపీ ఎంపీ దియా కుమారి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతానికి బీజేపీ వ్యాట్సప్ గ్రూప్ ల్లో తిరుగుతోంది.

Show comments