Idream media
Idream media
జనవరి 24, కృష్ణకుమారి 2వ వర్ధంతి. నేను చూసిన మొదటి సినిమా హీరోయిన్ కృష్ణకుమారి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1974లో రాష్ట్రస్థాయి నాటక పోటీలు జరిగాయి. దొంతి సుబ్బయ్య శెట్టి అనే పెద్దాయనకి నాటకాలంటే విపరీతమైన ఇష్టం. అందుకే అంత చిన్న ఊళ్లో కూడా పెద్దపెద్ద కళాకారులు వచ్చేవాళ్లు.
1974లో కృష్ణకుమారి మా ఊరు వచ్చారు. అప్పటికే ఆమె వదిన , అమ్మ వేషాల్లోకి వచ్చేశారు. ఆమెని చూడ్డానికి ఊరంతా విరగబడి వచ్చారు. నడి వయస్సులో కూడా అందంగానే ఉన్నారు. అప్పటికి ఆమె సినిమాలు చాలా చూశాను కాబట్టి రాజకుమారి లాగే వస్తుందనుకున్నా కానీ, పట్టుచీరలో వచ్చారు. పెద్దపెద్ద వాళ్ల పిల్లలంతా ఆమెతో ఫొటోలు తీసుకున్నారు. మేము దూరం నుంచి చూసే సెక్షన్. సినిమా నటుల్ని చూశామని చెప్పుకోవడం ఆ రోజుల్లో చాలా క్రేజ్. కృష్ణకుమారిని చూశామని నేను చాలా ఏళ్లు అడగని వాళ్లకి కూడా చెప్పేవాన్ని.
గొప్ప నటి కాదు కానీ, గ్లామర్ నటి. నవ్వితే నవరత్నాలు సినిమాతో యాక్టింగ్ ప్రారంభించారు. అగ్రనటులకి జమునతో గొడవలు రావడం వల్ల కృష్ణకుమారికి అవకాశాలు పెరిగాయి. కాంతారావుతో కూడా చాలా సినిమాలు చేశారు. దర్శకుడు విఠలాచార్య అంటే ఆమెకి భయం. షూటింగ్‌కి లేట్‌గా వస్తే , హీరోయిన్లని ఆయన శపించి చిలకలుగా మార్చి సినిమాల్లో ట్విస్ట్ పెట్టేవారు.
పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ తన సోదరి షావుకారు జానకితో బెంగళూరులో సెటిల్ అయ్యారు. అనారోగ్యంతో మృతి చెందారు.