iDreamPost
iDreamPost
రెడ్డిరాజులు తొలి రాజధాని అద్దంకి కాగా మలి రాజధాని కొండవీడు.
పాండ్యులు,విజయనగర బుక్కరాయలు నుంచి పెరుగుతున్న దాడులను తట్టుకునే శక్తి అద్దంకి కోటకు లేదని భావించటంతో ఆ ప్రాంతంలోనున్న వినుకొండ, బెల్లంకొండల కన్నా దృఢమైన, శత్రు దుర్బేధ్యమైన కోటను కట్టాలని తలచిన ప్రోలయ వేమారెడ్డి కొండవీడు కోట నిర్మాణం చేశాడు.ఆయన కొడుకు అనపోతారెడ్డి హయాంలో రెడ్డిరాజుల రాజధాని అద్దంకి నుంచి కొండవీడుకు మారింది.
1424లో రాచవేమారెడ్డి ఓటమితో కొండవీడు గజపతుల వశం అయ్యింది.అనంతరం శ్రీకృష్ణదేవరాయలు జయించేవరకు కొండవీడు గజపతుల – విజయనగర రాయల పాలనా కాలంలో రాజధానిగా కొనసాగింది.1515లో శ్రీకృష్ణదేవరాయలు కొండవీడును జయించి మహామంత్రి తిమ్మరుసు మేనల్లుడు నాదెండ్ల గోపయ్య మంత్రిని పాలకుడిగా నియమించాడు.ప్రస్తుత నాదెండ్ల మండలం ఈ ప్రాంత సమీపంలోనే ఉంది.
సదాశివ రాయలు హయాంలో 1570లో కొండవీడు గోల్కొండ నవాబ్ వశమయ్యింది. ముర్తాజా ఖాన్ అనే అతనిని కొండవీడు పాలకుడిగా నవాబ్ ఇబ్రహీం కుతుబ్ షా నియమించాడు. ఇతను గోపీనాథ పురమును తనపేరుతో ముర్తాజా నగర్ గా మార్చాడు.కొద్దికాలానికే పెనుగొండ తిరుమల రాయల పాలనలోకి కొండవీడు కోట వచ్చింది.
1579 లో ఇబ్రహీం కుతుబ్ షా కొండవీడును మరోసారి జయించి హైదర్ ఖాన్ ను పాలకుడిగా,ముట్టడిలో సహకరించిన రాయరావ్ ను రెవిన్యూ అధికారిగా నియమించాడు.
1598లో కులీకుతుబ్ షా శిఖవస్ ఖాన్ ను కొండవీటి పాలకుడిగా నియమించాడు. ఈ శిఖవస్ ఖాన్ తన పేరిట శిఖవస్ ఖాన్ పేటను కట్టించాడు. ఈ శిఖవస్ ఖాన్ పేట వాడుకలో సింగేజిఖాన్ పేట అయ్యింది. ప్రస్తుతం ఛంఘీజ్ ఖాన్ పేటగా పిలవబడుతుంది. ఇది ఛంఘీజ్ ఖాన్ పేట ఊరి పేరు వెనుక ఉన్న చరిత్ర.
ఈ ఛంఘీజ్ ఖాన్ పేటలో నవనీత బాలకృష్ణ విగ్రహం ఉన్న గుడి ఉంది.బాలకృష్ణడు పారాడే విగ్రహం అది. ఈ విగ్రహం నరసారావు పేట జమీందారులు స్థాపించింది కావచ్చు.ఛంఘీజ్ ఖాన్ పేటను, నవనీత బాలకృష్ణుడి గుడిని ఇస్కాన్ వారు దత్తు తీసుకున్నారు. 150 ఎకరాలలో గుడిని అభివృద్ధిచేస్తామని ఇస్కాన్ ప్రకటించింది.ఈ ఛంఘీజ్ ఖాన్ పేట గ్రామాన్ని సింగసాని పేట కూడా వ్యవహరిస్తారు.
శిఖవస్ ఖాన్ తరువాత పరాస్ ఖాన్,శిబ్ధీబివులుల్ ఖాన్,అసారస్ ఖాన్,ఎక్లస్ ఖాన్ తదితరులు అమీన్లుగా పాలించారు. గోల్కొండ నవాబ్ నుంచి ఫ్రెంచ్ వారు కొండవీడును బహుమతిగా పొందారు.వీరు రాజధానిని గుంటూరుకు మార్చారు. అయితే కొండవీడు ఎక్కువ రోజులు ఫ్రెంచ్ వారి అధీనంలో లేదు. 1758లో నిజాం మళ్ళీ కొండవీడును స్వాధీనం చేసుకున్నాడు. 1788లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో చేసుకున్న ఒప్పందంలో భాగంగా కొండవీడును ఈస్ట్ ఇండియా కంపెనీకి స్వాధీన పరిచారు.
బ్రిటీష్ హయాంలో మొదట కొండవీడు జిల్లాగా ఉన్నా తరువాత తాలూకా మారింది. చివరికి గ్రామం కూడా లేకుండా పోయింది.
ఈస్ట్ ఇండియా కంపినీ మరియు బ్రిటీష్ పాలనలో కొండవీడు 1810- 1812 వరకు మనూరి నరసన్న రావు పాలనలో ఉంది. ఈ నరసన్న రావు పేరు మీదనే నరసారావు పేట ఏర్పడింది.
Reference ,
1. ఈమని శివనాగి రెడ్డి గారి “కొండవీటి రెడ్డి రాజులు”
2. మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారి “రెడ్డిరాజులు చరిత్ర”