iDreamPost
android-app
ios-app

ఆ 17 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు

ఆ 17 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు

17 మంది ఎమ్మెల్యేల రాజీనామా చేసినందుకే తాను ముఖ్యమంత్రిని అయ్యానని వారికి ముందుగా హామీ ఇచ్చిన ప్రకారమే మంత్రులను చేస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. శిరసిలో యల్లాపుర అభ్యర్థి శివరాం హెబ్బార తరపున ఆదివారం యడ్యూరప్ప ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ శివరాం హెబ్బార లాంటివాళ్లు రాజీనామా చేయడం వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యానని గుర్తు చేసారు. ఆ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయనని, వారికి ఇచ్చిన మాట నెరవేర్చడమే తన లక్ష్యమని యడ్యూరప్ప పేర్కొన్నారు.

కాగా గతంలో కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విఫలమయిన సంగతి తెలిసిందే. 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం వల్ల కుమారస్వామి ప్రభుత్వం విశ్వాసపరీక్షలో బలనిరూపణ చేయలేక కూలిపోయింది. దానితో యడ్యూరప్ప ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడింది. అయితే పార్టీ విప్ ధిక్కరించి తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేలపై 2024 వరకూ ఎన్నికలలో పాల్గొనకుండా అప్పటి స్పీకర్ సురేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. దీనిపై సదరు ఎమ్మెల్యేలు సుప్రీకోర్టుకు వెళ్లగా స్పీకర్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై తీసుకున్న అనర్హత వేటును సమర్థిస్తూనే ఉపఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనితో యడ్యూరప్ప ఆ ఎమ్మెల్యేల తరపున ప్రచారం చేస్తున్నారు.

ఆదివారం బెళగావి జిల్లాలో గోకాక్‌, అథణి నియోజకవర్గాలలో పలు ప్రాంతాలలోయడ్యూరప్ప పర్యటించారు. ముందుగా మాట ఇచ్చిన ప్రకారమే ఉపఎన్నికలలో 17 మంది ఎమ్మెల్యేల గెలుపుకు కృషి చేస్తానని, ఉపఎన్నికల్లో గెలిచిన వారికి మంత్రి పదవులు ఇస్తానని యడ్యూరప్ప బహిరంగంగా మీడియాలో చెప్పడం కొసమెరుపు.