iDreamPost
iDreamPost
సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం అంటే 2000వ సంవత్సరం జనవరి 14న ప్రముఖ నటుడు దర్శకుడు రాకేష్ రోషన్ తన తనయుడు హృతిక్ రోషన్ ని హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కహో నా ప్యార్ హై విడుదల. వారసత్వం ట్యాగ్ తో కొడుకుని లాంచ్ చేసినప్పటికీ రాకేష్ రోషన్ మరీ అమితాబ్ బచ్చన్ అంత రేంజ్ వాడు కాదు. అందుకే ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించేలా వచ్చాయి .
ఎక్కడ చూసినా కహో నా ప్యార్ హై గురించిన కబుర్లే. ఎవరి నోట విన్నా కొత్త కుర్రాడు హృతిక్ ఆరుపలకల దేహం గురించి, మతి పోయేలా చేసిన డాన్సుల గురించిన చర్చే. ఆడియో క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అప్పుడప్పుడే మొగ్గతొడుతున్న సిడిల కల్చర్ రెక్కలు విప్పుకుంది. టి స్టాల్స్ మొదలుకుని పబ్బుల దాకా ఇవే పాటలు మారుమ్రోగిపోతున్నాయి.
అలా మొదలైన సంచలనం వంద రోజులు దాటినా చల్లారలేదు. వసూళ్ల సునామి అంటే ఏంటో షోలే, డిడిఎల్, హం ఆప్కే హై కౌన్ ల తర్వాత దీంతోనే చూస్తున్నామని ట్రేడ్ పండితులు అంగీకరించారు. మొదటి సినిమాతోనే హృతిక్ రోషన్ కు వచ్చిన క్రేజ్ చూసి అప్పుడప్పుడే బాలీవుడ్ ని శాశించే స్థాయికి చేరుకుంటున్న ఖాన్లకు ఆందోళన మొదలయ్యింది. నిర్మాతలు బ్లాంకు చెక్కులతో రోషన్ కుటుంబం ఇంటి బయట క్యూలు కడుతున్నారు. మరోపక్క దేశవ్యాప్తంగా కహో నా ప్యార్ హై ప్రింట్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడటంతో ల్యాబులు ఆ పనిలో బిజీగా ఉన్నాయి. ఆడియో సేల్స్ కు ఆకాశమే హద్దుగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని చిన్న కేంద్రాల్లో సైతం యాభై రోజులు ఆడిన ఈ సెన్సేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే
ఇందులో కథ చాలా సింపుల్. డబ్బులేక స్వంత కాళ్ళ మీద నిలబడుతూ అభిమానంతో బ్రతికే ఒక అబ్బాయి రిచ్ క్లాస్ అమ్మాయి ప్రేమించుకుంటారు. హీరోయిన్ తండ్రి పాలుపంచుకున్న ఓ కుట్రలో హీరో చనిపోతాడు. బాధతో ఉన్న హీరోయిన్ విదేశాలకు వెళ్ళినప్పుడు అచ్చం అదే పోలికలతో ఉన్న మరో హీరో కనిపిస్తాడు. ఇక అక్కడి నుంచి కొత్త డ్రామా మొదలవుతుంది. ఇద్దరు తిరిగి ఇండియా వచ్చాక ఏం జరిగిందన్నదే క్లైమాక్స్. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు
*ఈ కథకు స్ఫూర్తి 1986లో శివరాజ్ కుమార్ హీరోగా కన్నడలో వచ్చిన రధసప్తమి సినిమా
మొత్తానికి ఇండియా మొత్తంలో ఏ భాషలో అయినా ఏ డెబ్యూ హీరోకి రానంత గొప్ప రిసెప్షన్ హృతిక్ రోషన్ అందుకున్నాడు. చరిత్రలో అంతకు ముందు లేదు ఇప్పటిదాకా జరగలేదు. అందుకే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఇప్పటికీ తనదైన స్టార్ డంతో అశేష అభిమానులను 20 ఏళ్ళుగా హృతిక్ రోషన్ అలరిస్తూనే ఉన్నాడు. డౌట్ ఉంటే కహో నా ప్యార్ హైలో పాటలు చూసి ఇటీవలే వచ్చిన వార్ లో హృతిక్ రోషన్ డాన్స్ చూడండి. మేము చెప్పింది నిజమని మీరే ఒప్పుకుంటారు.