iDreamPost
android-app
ios-app

జురాసిక్ వరల్డ్ డొమినియన్ రిపోర్ట్

  • Published Jun 11, 2022 | 11:07 AM Updated Updated Jun 11, 2022 | 3:43 PM
జురాసిక్ వరల్డ్ డొమినియన్ రిపోర్ట్

1993లో స్టీవెన్ స్పీల్బర్గ్ సృష్టించిన జురాసిక్ పార్క్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అప్పటి పిల్లలు యూత్ అంత ఈజీగా మర్చిపోలేరు. టెక్నాలజీ ఇప్పుడున్నంత స్థాయిలో లేని రోజుల్లోనే డైనోసర్ల రూపంలో తెరమీద వాటి విలయాన్ని చూపించిన తీరు వేల కోట్ల రూపాయల వసూళ్లను సాధించి పెట్టింది. ఆ తర్వాత ది లాస్ట్ వరల్డ్, జురాసిక్ పార్క్ 3, జురాసిక్ వరల్డ్, జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్ డంలు వచ్చాయి. అన్నీ హిట్లే. ఇప్పుడు ఆఖరుది జురాసిక్ వరల్డ్ డొమినియన్ నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యింది. ఒక రోజు ముందే అంటే సాయంత్రమే దీని ప్రీమియర్లు ఇండియా వైడ్ వేశారు. ఇన్ని అంచనాలున్న ఈ సినిమా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

ఫాలెన్ కింగ్ డమ్ ఎక్కడ ముగిసిందో ఇదక్కడే కంటిన్యూ చేశారు. భార్యతో అడవిలో ఉంటున్న ఓవెన్ గ్రేడీ(క్రిస్ ప్రాట్) కు డైనోసర్ల మీద ప్రయోగాలు చేస్తున్న డాక్టర్ ముఠా ఒకటి ప్రమాదం తలపెడుతుంది. పాపతో పాటు ఓ బుల్లి డైనోసర్ ని ఎత్తుకుపోతారు. దీంతో వాళ్ళను వెతికి పట్టుకునేందుకు గ్రేడీ ప్రాణాలకు తెగించి వాళ్ళుండే స్థావరానికి వెళ్తాడు. కానీ అక్కడ పంటలను నాశనం చేసే మిడతల దండుని పెంచి పోషించే గ్యాంగ్ కూడా ఇదేనని తెలుస్తుంది. ఈలోగా బంధించబడిన డైనోసర్లు ఊరిలోకి వచ్చేస్తాయి. మరోవైపు ల్యాబ్ లో ప్రమాదరకమైన పరిస్థితులు ఏర్పడతాయి. చివరికి ఏమైంది ముగింపు ఎలా ఇచ్చారనేది తెరమీద చూడాలి.

యునివర్సల్ పిక్చర్స్ ఇది చివరి భాగమని ప్రకటించేసింది కాబట్టి మళ్ళీ రాకాసి బల్లులను తెరమీద చూడలేం. ఈ సిరీస్ వీరాభిమానులకు ఓ మోస్తరు సంతృప్తినిస్తుంది కానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం డొమినియన్ ఎక్స్ పీరియన్స్ ఏమంత గొప్పగా అనిపించదు. ఇంటర్వెల్ కు ముందు వచ్చే చేజ్ ఒక్కటే గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది కానీ మిగిలిన రెండుంపావు గంటల్లో దర్శకుడు కొలిన్ ట్రెవరో ఏమంత ప్రభావం చూపించలేకపోయాడు. దీనికంటే ముందు వచ్చిన అయిదు భాగాలే నయమనిపిస్తాయి. త్రిడి వెర్షన్ కూడా చెప్పుకునేంత గొప్పగా లేదు. ఇప్పటికే పలుమార్లు అరిగిపోయిన ఇలాంటి కథలను ఇక్కడితో ముగించేయడం మంచిదే.